ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ప్రస్తుతం సమాజం టెక్నాలజీలో దూసుకెళ్లిపోతున్నా.. మనుషుల్లో మాత్రం క్రూరత్వం పోవడం లేదు.
తాజాగా వరకట్న వేధింపులకు ఓ తెలుగు హీరోయిన్ బలైపోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ట్విషా శర్మ.. తెలుగు హీరోయిన్. అంతేకాదు మాజీ మిస్ పూణె. మోడలింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినిమాతో పాటు పలు ప్రాంతీయ చిత్రాల్లో నటించింది. కానీ జీవితం వరకట్న పిశాచికి బలైపోతుందని ఊహించలేకపోయింది. భర్త, అత్తమామల వరకట్న వేధింపులకు ట్విషా శర్మ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
నోయిడాలో నివాసం ఉంటు ట్విషా శర్మకు… 2025 డిసెంబర్ 9న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్‌సింగ్‌తో ఢిల్లీలో గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచి కూడా వేధింపులకు గురవుతూనే ఉంది. ఈ నెల 12న భోపాల్‌లోని అత్తగారింట్లో ట్విషా శర్మ విగతజీవిగా కనిపించింది.
సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబం తల్లడిల్లిపోయింది. తమ కుమార్తెను అన్యాయంగా అత్తమామలు చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ట్విషా శర్మ తన తల్లితో వాట్సాప్‌లో చాట్ చేసిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. భర్త సమర్థ్‌సింగ్, కుటుంబ సభ్యులు నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. భర్త, అత్తమామలు నిరంతరం మానసిక వేధింపులు, శారీరక హింసకు గురి చేశారని తల్లడిల్లింది. మరణానికి ముందు మే 7న జరిగిన చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక ట్విషా శర్మ వాట్సాప్ చాట్ వెలుగులోకి రావడంతో.. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిరసనకు దిగింది. తమ కుమార్తెను చంపేసి.. ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

