దాదాపు 12 గంటల హైడ్రామా తర్వాత తమిళనాడు విపక్ష నేత, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. హీరోయిన్ త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో డీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. మొత్తానికి ఇన్ని గంటల తర్వాత రాత్రి 8 గంటలకు స్టేషన్ నుంచి ఉదయనిధి విడుదలయ్యారు. అనంతరం స్టేషన్ ఎదుట డీఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీ స్వాగతం పలికారు. అటు తర్వాత ర్యాలీగా బయల్దేరి ఇంటికి వెళ్లారు.
ప్రముఖ నటి త్రిషను ఉద్దేశిస్తూ ఆయన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'డబుల్ మీనింగ్' వ్యాఖ్యల కేసులో విచారణ అనంతరం ఉదయనిధిని విడుదల చేయాలని పోలీసులను మంగళవారం ఆదేశించింది. దర్యాప్తు అధికారులు కోరినప్పుడల్లా విచారణకు సహకరించాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
కావేరీ జలాల అంశంపై ఆగస్టు 3న తంజావూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఉన్న కొందరు డీఎంకే కార్యకర్తలు ''త్రిష.. త్రిష'' అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఉదయనిధి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా, ద్వంద్వార్థంతో ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అనంతరం తాను నటి త్రిషను ఉద్దేశించి మాట్లాడలేదని, కావేరీ నదికి సంబంధించిన సందర్భంలోనే వ్యాఖ్యానించానని ఉదయనిధి వివరణ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉదయనిధిపై స్థానిక పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదులు చేసింది. తంజావూరు తూర్పు పోలీస్ స్టేషన్‌లో టీవీకే కేంద్ర జిల్లా మహిళా విభాగం నిర్వాహకురాలు ఎస్. బైరవి ఫిర్యాదు చేశారు.
ఉదయనిధి వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, నటి త్రిషతో పాటు మహిళలందరికీ మానసిక వేదన కలిగించాయని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన 2 నిమిషాల 39 సెకన్ల వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసి ప్రజల్లో ఉద్రిక్తతలకు కారణమయ్యారని కూడా పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌పై పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్యకర పదాలను ఉపయోగించడం, మహిళ గౌరవాన్ని కించపరచడం, విద్వేషాలను ప్రేరేపించడం, అల్లర్లకు దారితీసేలా రెచ్చగొట్టడం, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలతో మొత్తం తొమ్మిది సెక్షన్లను వర్తింపజేసినట్లు సమాచారం. తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను కూడా కేసులో చేర్చినట్లు తెలిసింది.
ఉదయనిధి స్టాలిన్ నివాసానికి పోలీసులు చేరుకున్న వెంటనే ఆయన తరఫున మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి. అయితే అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారణ నిమిత్తం తంజావూరుకు తరలించారు.
విచారణ సందర్భంగా తంజావూరు పోలీసుల తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధిని తంజావూరుకు తీసుకెళ్లినప్పటికీ.. ఆయనను న్యాయస్థాన రిమాండ్‌కు పంపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కోర్టుకు తెలిపారు. కేవలం విచారణ కోసం ప్రశ్నించి.. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయడమే పోలీసుల ఉద్దేశమని వివరించారు. దీంతో ఉదయనిధిని విచారించిన తర్వాత విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అధికారులు పిలిచినప్పుడల్లా సహకరించాలని సూచించింది.
పోలీసులు తీసుకెళ్లే ముందు ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి పేరును తప్ప మరెవరి పేరునూ ప్రస్తావించలేదని అన్నారు. ''తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పేరు తప్ప మరెవరి పేరు నేను చెప్పాను? మరి ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? దీనిపై కోర్టే నిర్ణయం తీసుకుంటుంది'' అని వ్యాఖ్యానించారు.
తంజావూరు మార్గంలో సెంగిపట్టి దగ్గర పోలీసు వాహనం నుంచి దిగేందుకు ఉదయనిధి తొలుత నిరాకరించారు. కేసుకు సంబంధించిన పోలీస్ స్టేషన్‌లోనే విచారణ జరపాలని కోరారు. దీంతో అక్కడ డీఎంకే కార్యకర్తలు నిరసనకు దిగారు. అనంతరం ఉదయనిధి వాహనం నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. తర్వాత సెంగిపట్టిలో విచారణకు సహకరించేందుకు అంగీకరించారు.
ఉదయనిధి అరెస్టుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్టు విషయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. ఉదయనిధి అరెస్టుకు నిరసనగా డీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు టీవీకే మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు డీఎంకే మాత్రం ఈ కేసు రాజకీయ ఉద్దేశంతో నమోదు చేసినదని ఆరోపిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఉదయనిధి విడుదలకు మార్గం సుగమమైనప్పటికీ.. ఈ వ్యవహారంపై రాజకీయ పోరు మరింత తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

