Dailyhunt
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

NTV Telugu 3 weeks ago

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ మొదలైనప్పటికీ, బయట మాత్రం అభిమానుల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి.

స్టేడియం ప్రవేశ ద్వారాల వద్ద పోలీసుల ఆంక్షలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు తమ వెంట తెచ్చుకున్న వ్యాలెట్లను (Wallets) లోపలికి అనుమతించకపోవడంతో గేట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

అసలు వివాదం ఏమిటి..?

సాధారణంగా భద్రతా కారణాల దృష్ట్యా పవర్ బ్యాంకులు, సెల్ఫీ స్టిక్స్, సిగరెట్లు వంటి వస్తువులను నిషేధిస్తారు. అయితే.. ఈసారి పోలీసులు వ్యాలెట్లను కూడా అనుమతించబోమని చెప్పడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. నిషేధిత వస్తువుల అధికారిక జాబితాలో వ్యాలెట్ పేరు లేకపోయినా, సిబ్బంది అడ్డుకోవడంతో ఫ్యాన్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డబ్బులు, ఐడెంటిటీ కార్డులు ఉండే వ్యాలెట్లను ఎక్కడ పెట్టాలో తెలియక అభిమానులు గేట్ల వద్దే నిలిచిపోయారు.

అభిమానుల ఇబ్బందులు..

చాలా దూరం నుంచి మ్యాచ్ చూడటానికి వచ్చిన వారు, తమ వద్ద ఉన్న వ్యాలెట్లను భద్రపరుచుకోవడానికి స్టేడియం వద్ద క్లోక్ రూమ్ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు తమ వస్తువులను బయట పడేయలేక, లోపలికి వెళ్లలేక స్టేడియం బయటే ఉండిపోయారు. “టికెట్లు కొని కూడా మ్యాచ్ చూడలేకపోతున్నాం” అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్ ప్రారంభమైనా ఇంకా చాలా మంది ఫ్యాన్స్ గేట్ల బయటే పోలీసుల తీరుపై నిరసన తెలుపుతున్నారు. ఈ గందరగోళం సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో.. కనీస సమాచారం లేకుండా ఇలాంటి ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu