Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!

US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!

NTV Telugu 1 week ago

US Military: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా అత్యాధునిక క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా భావించే అగ్రరాజ్యం అమెరికా వద్ద ఉన్న కొన్ని కీలక దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగం భారీగా పెరగడంతో ఆయుధ నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని నివేదిక పేర్కొంది. అయితే తమ వద్ద అవసరానికి మించిన ఆయుధాలు ఉన్నాయని, ఉత్పత్తిని కూడా వేగంగా పెంచుతున్నామని వైట్ హౌస్, పెంటగాన్ స్పష్టం చేస్తున్నాయి.

ఏ క్షిపణులపై ఎక్కువ ప్రభావం అంటే..

రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ATACMS), ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్ (PrSM) వంటి దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలు భారీగా వినియోగంలోకి వెళ్లాయి. PrSM కొత్త తరం క్షిపణి కావడంతో ప్రారంభం నుంచే వీటి సంఖ్య పరిమితంగానే ఉందని సమాచారం. ATACMS సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. PrSM ప్రారంభ వెర్షన్ 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండగా, భవిష్యత్ వెర్షన్లు మరింత ఎక్కువ దూరాన్ని చేరుకోనున్నాయి. అమెరికన్ థింక్ ట్యాంక్ సీఎస్‌ఐఎస్ (CSIS) అంచనాల ప్రకారం.. ATACMS, PrSM మాత్రమే కాకుండా పలు కీలక క్షిపణుల నిల్వలపై కూడా ఒత్తిడి పెరిగింది. పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ల నిల్వలు సుమారు 65 శాతం వరకు వినియోగంలోకి వెళ్లినట్లు, THAAD ఇంటర్‌సెప్టర్ల నిల్వలు సుమారు 38 శాతం తగ్గినట్లు అంచనా వేసింది. అలాగే టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్ల గ్లోబల్ స్టాక్‌లో సుమారు సగం వరకు వినియోగమైనట్లు పేర్కొంది. అయితే ఈ గణాంకాలను ధృవీకరించడం సాధ్యం కాలేదని రాయిటర్స్ స్పష్టం చేసింది.

ఆందోళన ఎందుకు పెరుగుతోందంటే..

రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా ఒకేసారి పలు ప్రాంతాల్లో భద్రతా సవాళ్లను ఎదుర్కొంటే ఆధునిక క్షిపణుల లభ్యత కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఉద్రిక్తతలు లేదా ఇతర భద్రతా సంక్షోభాలు తలెత్తితే ఈ ఆయుధాలు అత్యంత కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న పేట్రియట్, ATACMS వంటి క్షిపణుల సరఫరాపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా నిల్వలు తగ్గితే భవిష్యత్ సైనిక సహాయంపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. రక్షణ విశ్లేషకుల ప్రకారం.. పేట్రియట్, THAAD, టోమాహాక్ వంటి క్షిపణుల నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యంతో మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో రేథియాన్, పెంటగాన్ టోమాహాక్ ఉత్పత్తి పెంపుపై చర్యలు తీసుకుంటుండగా, లాక్‌హీడ్ మార్టిన్ ATACMS, PrSM, THAAD క్షిపణుల తయారీని వేగవంతం చేసే దిశగా పనిచేస్తోంది.

అయితే ఈ నివేదికలతో వైట్ హౌస్ పూర్తిగా ఏకీభవించడం లేదు. ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా అమెరికా వద్ద అత్యధిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఎప్పుడైనా సైనిక చర్యలు చేపట్టేందుకు తమ వద్ద తగినంత సామర్థ్యం ఉందని పెంటగాన్ అధికార ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపారు. క్షిపణుల ఉత్పత్తి గతంతో పోలిస్తే ప్రస్తుతం రికార్డు స్థాయిలో కొనసాగుతోందని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu