Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..

Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..

NTV Telugu 2 weeks ago

సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి ప్రారంభించి, నీటిని విడుదల చేయనున్నారు.

వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జీవం లభించనుంది. ముఖ్యంగా 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించడం చారిత్రక ఘట్టంగా నిలవనుంది. 'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.

కరవు నేలకు కృష్ణమ్మ జలాలు..
తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలు, సాగునీటి కొరతతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి వెలిగొండ కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే కాదు… ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే జీవనాధార ప్రాజెక్టు. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేసి, ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా సుమారు 23 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం చేకూరనుంది.

తొలిదశతో కొత్త అధ్యాయం..
తొలి దశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేయనున్నారు. తొలి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెలిగొండ జలాలు అందుబాటులోకి రావడం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. సాగునీటి భద్రత పెరగడంతో పంటలపై అనిశ్చితి తగ్గి, పంటల వైవిధ్యీకరణకు అవకాశం ఏర్పడుతుంది. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు ఉద్యానవనం, అగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి, వలసలకు అడ్డుకట్ట పడనుంది.

30 ఏళ్ల ప్రయాణం… సంకల్పం నుంచి సాకారం వరకు..
1996లో శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ప్రయాణంలో ఎన్నో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. సొరంగాల నిర్మాణం, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, భూసేకరణ, పునరావాసం వంటి క్లిష్టమైన అంశాలను అధిగమిస్తూ ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయి. 2024లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అనంతరం వెలిగొండను అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకుని పనులను వేగవంతం చేసింది.

టన్నెల్ పనులు, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, ఇతర అనుబంధ నిర్మాణాలతో పాటు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పరిహారం చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం 48 రోజుల వ్యవధిలో నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల మేర పరిహారం చెల్లింపులు జరపడం ద్వారా పనులకు వేగం తీసుకువచ్చింది. అంతేకాకుండా గెజిట్, జాబితాలో పేర్లు లేని వారికోసం మరో రూ.169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్ల నిండిని వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. 'శంకుస్థాపన చేసింది చంద్రబాబు… ప్రారంభిస్తున్నదీ చంద్రబాబే' అన్న అరుదైన చారిత్రక ఘట్టానికి ఆగస్టు 31వ తేదీ వేదిక కానుంది. 30 ఏళ్ల క్రితం చేసిన సంకల్పం ఇప్పుడు సాకారమవుతుండటం మార్కాపురం ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, ఉదయం 10.15 గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు. ఉదయం 10.25 గంటలకు రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10.35 గంటల నుంచి 11.20 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి… వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రాజెక్టు గేట్లను ప్రారంభించి వెలిగొండకు కృష్ణా జలాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు గంటవానిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సభ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమై మధ్యాహ్నం 2.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu