Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
VenkyAnil5: సెట్స్‌పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్‌ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!

VenkyAnil5: సెట్స్‌పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్‌ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!

NTV Telugu 2 weeks ago

VenkyAnil5: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న #VenkyAnil5 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి, ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గరపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కీలక షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆయన ట్రెడిషనల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. అలాగే కల్యాణ్ రామ్‌పై ఓ పాట చిత్రీకరణను కూడా చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ తొలి షెడ్యూల్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొన్నారు.

తాజాగా విక్టరీ వెంకటేష్ సెట్స్‌పైకి రావడంతో షూటింగ్ మరింత వేగం అందుకుంది. భారీ సెట్‌లో వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిత్ర నిర్మాణంలో ఈ లాంగ్ షెడ్యూల్ అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్, కల్యాణ్ రామ్ కలిసి కనిపించే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరి మధ్య ఉండే ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్‌తో కలిసి ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కనిపించనున్నారు. సెంటిమెంట్, కామెడీ, పండుగ వాతావరణం, మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్‌కు తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

టెక్నికల్ గా కూడా ఈ సినిమాకి మంచి టీమ్ పనిచేస్తోంది. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్. ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్. కృష్ణ వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యతలను అనిల్ రావిపూడి స్వయంగా చేపట్టారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతున్న ఈ మల్టీస్టారర్‌ను 2027 సంక్రాంతి సందర్భంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసివస్తుండటంతో, ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu