Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!

Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!

NTV Telugu 1 week ago

Vivek Agarwal’s Family: కొన్నిసార్లు ప్రమాదాలు కేవలం ప్రాణాలను మాత్రమే తీసుకోవు.. పచ్చని కుటుంబాల కథలను, వారి కలలను సమాధి చేస్తాయి. ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో ఉన్న ఒక హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇటువంటి ఒక హృదయవిదారక విషాదాన్ని మిగిల్చింది.

ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న తండ్రిని కాపాడుకోవాలని, ఆయనకు మనోధైర్యం చెప్పాలని వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన వారు.. మంటలు, పొగల మధ్య ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో దీపం వెలిగించే వారే లేకుండా పోయారు.

తండ్రి కోసం వచ్చి.. మృత్యుఒడిలోకి చేరారు
గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) వివేక్ అగర్వాల్ తండ్రి తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్‌లో చేరారు. ఐసీయూలో ఉన్న తండ్రిని పరామర్శించడానికి, ఆయనకు ధైర్యం చెప్పి ఆయనను కోలుకునేలా చేయాలని వివేక్ అగర్వాల్ తన భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చారు. ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని మాల్వీయా నగర్‌లోని ఒక హోటల్‌లో గది బుక్ చేసుకున్నారు. ఇదే సమయంలో వివేక్ అగర్వాల్‌ను, ఆయన తండ్రిని చూడటానికి వివేక్ మామ, అత్త, మరో బంధువు కూడా ఢిల్లీకి వచ్చి అదే హోటల్‌లో బస చేశారు. రాత్రంతా మామూలుగానే గడిచింది. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి బయలుదేరడానికి అందరూ రెడీ అవుతున్న టైంలో.. ఒక్కసారిగా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే భవనం అంతా దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో, ఆ కుటుంబం ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన పోరాటం విఫలమైంది. పొగలో ఊపిరాడక, కాలిన గాయాలతో వారి కుటుంబ సభ్యుల్లో చాలా మంది అక్కడికక్కడే మరణించారు.

ఈ విషాదంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. మాక్స్ ఆసుపత్రి బెడ్‌పై చావుబతుకుల మధ్య ఉన్న వృద్ధ తండ్రికి తన కొడుకు, కోడలు, మనవరాలు ఇక లేరనే నిజం ఇప్పటికీ తెలియదు. తనను చూడటానికి వస్తున్నారనుకున్న ఆ అడుగుల చప్పుడు శాశ్వతంగా ఆగిపోయిందనే చేదు నిజాన్ని మోస్తూ ఆ వృద్ధుడు ఆసుపత్రిలో ఒంటరిగా మిగిలిపోయారు. ఇటు గురుగ్రామ్‌ సెక్టర్ 46లోని వివేక్ అగర్వాల్ నివాసం వద్ద శ్మశాన నిశ్శబ్దం నెలకొంది. ఎప్పుడూ నవ్వులతో కళకళలాడే ఆ ఇల్లు ఇప్పుడు మూగబోయింది. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే వివేక్, పిల్లల చదువుల కోసం వ్యాపారాన్ని కూడా వదులుకున్న ఆయన భార్య, చదువుల్లో టాపర్లుగా నిలిచే ఇద్దరు కుమార్తెలు రాత్రికి రాత్రే అనంతలోకాలకు వెళ్లిపోయారనే వార్తను ఇరుగుపొరుగు వారు నమ్మలేకపోతున్నారు.

కటకటాల వెనక్కి హోటల్ యజమాని..
ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు తీవ్రంగా స్పందించారు. హోటల్ యజమాని లవేకేశ్ బజాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఈ భవనాన్ని కొనుగోలు చేసి, గతంలో ఉన్న ఖాదీ దుకాణాన్ని హోటల్, గెస్ట్ హౌస్‌గా మార్చినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే హోటల్‌కు సరైన అనుమతులు ఉన్నాయా? అగ్నిమాపక భద్రతా నియమాలు (Fire Safety) పాటించారా? ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ మార్గాలు తెరిచే ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. నిందితులు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు యజమానితో పాటు అతని భార్యపై కూడా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu