West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో చేరిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్(TMC) ఎంపీల్లో 17 మంది బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కూచ్‌బెహార్ ఎంపీ, రెబల్ టీఎంసీ నేత జగదీశ్ చంద్ర బర్మా బసునియా చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దుర్గాపూజకు ముందు లేదా ఆ తర్వాత 17 మంది ఎంపీలు బీజేపీలో చేరుతారని అన్నారు. అయితే, బసునియా వ్యాఖ్యల్ని తోటి రెబల్ ఎంపీలు ఖండించారు. ఇది ఎంపీల సమిష్టి నిర్ణయం కాదని, బసునియా వ్యక్తిగత వ్యాఖ్యలని స్పష్టం చేశారు.
20 మంది ఎంపీల్లో 17 మంది బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని బసునియా అన్నారు. ఈ సంఖ్య మూడింట రెండు వంతుల అవుతుందని దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తమకు వర్తించదని చెప్పుకొచ్చారు. టీఎంసీకి మొత్తం 27 మంది ఎంపీలు ఉంటే 20 మంది అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఘోర ఓటమి తర్వాత, మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి ప్రత్యేకవర్గంగా ఏర్పడ్డారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.
NCPIలో ఎందుకు చేరారు..?
మమతా బెనర్జీ ఓటమి తర్వాత టీఎంసీలో తిరుగుబాటు మొదలైంది. పార్టీ రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో జూన్ 14న 20 మంది రెబల్ టీఎంసీ ఎంపీలు NCPIలో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు. తమను ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలని కోరారు. బసునియా చెబుతున్న దాని ప్రకారం, ముందుగా ఎంపీలంతా బీజేపీలో చేరాలని అనుకున్నారని, అయితే ముగ్గురు మైనారిటీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఇష్టపడకపోవడంతోనే NCPIలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.
ఇంకా తేలని పంచాయతీ..
రెబల్ వర్గానికి సంబంధించి చట్టపరమైన హోడా ఇంకా తేలలేదు. లోక్‌సభ రికార్డుల్లో 20 మంది ఎంపీలు ఇప్పటికీ టీఎంసీ సభ్యులుగానే ఉన్నారు. NCPI ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తింపు ఇవ్వాలన్న వారి అభ్యర్థనపై తుది నిర్ణయం వెలువడలేదు. అయితే, పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం వీరందర్ని అనర్హులుగా ప్రకటించాలని టీఎంసీ నాయకత్వం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరింది. మమతా వర్గం ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఆగస్టు 26న లోక్‌సభ సెక్రటేరియట్ 20 మంది ఎంపీలకు నోటీసులు జారీ చేసి, అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని కోరింది. ఎంపీలు మరో మూడు వారాల సమయం కోరగా స్పీకర్ ఓం బిర్లా ఆ గడువును పొడిగించారు. దీంతో సమాధానాలు ఇవ్వడానికి సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా ఎంపీలకు నోటీసులు జారీ చేసింది.
రెబల్ ఎంపీలు ఏమంటున్నారు.. బీజేపీ స్పందనేంటి..?
బసునియా వ్యాఖ్యల్ని తోటి ఎంపీలు ఖండించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. రెబల్ వర్గంలోని ఎంపీ అబు తాహెర్ ఖాన్, జంగీపూర్ ఎంపీ ఖలీలుర్ రహమాన్, బర్హంపూర్ ఎంపీ యూసఫ్ ఫఠాన్‌లు బీజేపీలో చేకుండా ఎన్డీయేకు మద్దతు ఇస్తారని బసునియా వ్యాఖ్యానించారు. దీనిపై అబు తాహెర్ ఖాన్ మాట్లాడుతూ.. మేం బీజేపీలోకి వెళ్లం, ఎన్డీయలోకి వెళ్లం అని స్పష్టం చేశారు. అయితే, ప్రధాని లేదా సీఎం అభివృద్ధి సంబంధిత అంశాలకు సంబంధించి పిలిస్తే సమావేశాలకు హాజరవుతామని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించింది. బసునియా వ్యాఖ్యలపై ఎలాంటి సమాచారం లేదని బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి దేబ్జిత్ సర్కార్ తెలిపారు. బీజేపీ చేరాలని కోరుకుంటే సరిపోదని అన్నారు. తమకు తెలిసినంత వరకు టీఎంసీ రెబల్ ఎంపీలు ఎవరూ బీజేపీలో చేరడం లేదని బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య అన్నారు.

