Dailyhunt
West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..

West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..

NTV Telugu 1 week ago

West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన భారతీయ జనతా పార్టీ (BJP), మే 9వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య మంగళవారం వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో ఇంకా అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పేరును ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంతో పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలంగా సాగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు తెరపడింది.

కేంద్రం – రాష్ట్రంలో ఒకే పార్టీ
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాల్లో గెలుపొంది, మూడింట రెండొంతుల మెజారిటీని సాధించింది. ప్రతిష్టాత్మకమైన భవానీపూర్ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఘనవిజయం సాధించారు. 1972 తర్వాత బెంగాల్‌లో కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. దీనివల్ల రాష్ట్ర పరిపాలనలో, రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయోత్సవాల అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. బెంగాల్ భయం నుంచి విముక్తి పొందిందని ఆయన అన్నారు. “బెంగాల్‌లో దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ హింసా సంస్కృతికి నేటితో ముగింపు పడాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రతీకారం కాదు, మార్పు. భయం గురించి కాదు, భవిష్యత్తు గురించి చర్చ జరగాలి” అని ప్రధాని పిలుపునిచ్చారు. రాజకీయ హింసను వీడి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu