Dailyhunt
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర దీదీ ధర్నా..

West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర దీదీ ధర్నా..

NTV Telugu 2 weeks ago

West Bengal Elections 2026: వెస్ట్ బెంగాల్‌లో ఇటీవల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతలో గురువారం రాత్రి ఒక్కసారిగా హైడ్రామా చోటు చేసుకుంది.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఆరోపణలు చేయడంతో కోల్‌కతా వీధులు రణరంగంగా మారాయి. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం వెలుపల టీఎంసీ దిగ్గజ నేతలు డాక్టర్ శశి పంజా, కునాల్ ఘోష్ కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. స్ట్రాంగ్ రూమ్ లోపల ఉన్న బ్యాలెట్ బాక్సులతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గందరగోళం సృష్టిస్తున్నారంటూ ఓ సీసీటీవీ ఫుటేజీని టీఎంసీ విడుదల చేయడంతో ఉద్రిక్తత మొదలైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. సఖావత్ మెమోరియల్ స్కూల్‌లోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న ఆమె, గంటల తరబడి అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీదీ అక్కడి నుంచి వెళ్లే వరకు తాము కూడా కదలబోమని బీజేపీ నేతలు భీష్మించుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతి కష్టం మీద ఇరు వర్గాలను శాంతింపజేశారు.

ఇక, టీఎంసీ విడుదల చేసిన వీడియో, ఆరోపణలను ఎన్నికల కమిషన్ (EC) కొట్టి పారేసింది. టీఎంసీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, అక్కడ బ్యాలెట్ బాక్సుల ట్యాంపరింగ్ జరగడం లేదని స్పష్టం చేసింది. నిజానికి పోస్టల్ బ్యాలెట్ల వర్గీకరణ (Sorting) ప్రక్రియ జరుగుతోందని, ఈ విషయంపై ముందే అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చామని కమిషన్ తెలిపింది. ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రంలోని 7 స్ట్రాంగ్ రూమ్‌లు భద్రంగా, సీల్ వేసి ఉన్నాయని, కేవలం పక్క గదిలో పోస్టల్ బ్యాలెట్ల పని జరుగుతుండటంతో టీఎంసీ నేతలు భ్రమపడ్డారని వివరణ ఇచ్చింది.

ఈ పరిణామంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడులు చోటు చేసుకున్నాయి. కేవలం కోల్‌కతాలోనే కాకుండా దుర్గాపూర్‌లోనూ వాతావరణం వేడెక్కింది. స్ట్రాంగ్ రూమ్‌కు 200 మీటర్ల దూరంలోనే సుమారు 100 మంది టీఎంసీ కార్యకర్తలు షిఫ్టుల వారీగా పహారా కాస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా వారు డేరాలు వేసుకుని కూర్చున్నారు. ఇటు మానిక్తలాలో బీజేపీ అభ్యర్థి తాపస్ రాయ్ పోలీసులతో వాగ్వాదానికి దిగగా, విపక్ష నేత సువేందు అధికారి సైతం అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇక, ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా, మమతా బెనర్జీ త్వరలో దుర్గాపూర్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉండటంతో బెంగాల్ రాజకీయాలు ఫలితాలకు ముందే మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు కౌంటింగ్ వరకు నిఘా విషయంలో రాజీ పడేది లేదని టీఎంసీ తెగేసి చెబుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu