రాజకీయ అస్థిరతను పెంచుతాయా?
ఇప్పుడు ఎంపాక్స్ విషయంలో పరిస్థితి ఇంకా దారుణంగా మారిందని నివేదిక చెబుతోంది. ఎంపాక్స్ వ్యాక్సిన్లు పేద దేశాలకు చేరడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అంటే కరోనా తర్వాత కూడా ప్రపంచం సమానత్వం నేర్చుకోలేదన్న మాట. ఒక పేద దేశంలో ప్రాణం విలువ ఇంకా తక్కువగానే ఉందని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఇక్కడ మరో ప్రమాదకర అంశం ప్రజల్లో పెరుగుతున్న అవిశ్వాసం. కరోనా సమయంలో సోషల్ మీడియాలో పుకార్లు ఎలా వ్యాపించాయో ప్రపంచం చూసింది. వ్యాక్సిన్లపై అనుమానాలు పెరిగాయి. శాస్త్రవేత్తలపై దాడులు జరిగాయి. ప్రభుత్వాలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు WHO అనుబంధ బోర్డు చెబుతున్నది కూడా ఇదే. భవిష్యత్ మహమ్మారులు కేవలం ఆరోగ్య సంక్షోభాలగా మాత్రమే మిగిలిపోకుండా అవి రాజకీయ అస్థిరతను కూడా పెంచుతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై దెబ్బకొడతాయి. సమాజంలో విభజనలు పెంచుతాయి. అంటే ఒక వైరస్ కేవలం శరీరాలను మాత్రమే కాకుండా దేశాల స్థిరత్వాన్ని కూడా కూల్చగలదని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
మరోవైపు భారత్‌కు ఈ హెచ్చరికలు చాలా కీలకం. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా విపత్తుల్లో భారత్ ఒకటి. సెకండ్ వేవ్ సమయంలో ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడం, ఆక్సిజన్ కొరత, గంగానదిలో తేలిన మృతదేహాలు, శ్మశానాల్లో ఆగని దహనాలు ఇంకా ప్రజల మదిలోనే ఉన్నాయి. అయినప్పటికీ భారత ఆరోగ్య వ్యవస్థలో ఇంకా భారీ లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత కొనసాగుతోంది. వ్యాధులను ముందుగానే గుర్తించే సర్వైలెన్స్ వ్యవస్థలు బలహీనంగానే ఉన్నాయి. అత్యవసర నిధుల విడుదలలో ఆలస్యం ఇంకా పెద్ద సమస్యగానే ఉంది. భారీ జనాభా, వేగంగా పెరుగుతున్న నగరాలు, రాష్ట్రాల మధ్య వలసలు లాంటివి భారత్‌ను భవిష్యత్ మహమ్మారులకు అత్యంత సున్నిత దేశంగా మారుస్తున్నాయి. ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన కానీ భయపెట్టే అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI టెక్నాలజీ వైరస్‌లను ముందుగానే గుర్తించగలదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా పోస్టులు… ఆస్పత్రుల డేటా… ప్రయాణాల సమాచారం విశ్లేషించి వ్యాధి వ్యాప్తిని ముందుగానే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ప్రమాదం ఉందట. ధనిక దేశాలకే అధునాతన టెక్నాలజీ అందితే పేద దేశాలు మరింత వెనుకబడిపోతాయి. అంతేకాదు… తప్పుడు సమాచారం వ్యాప్తిలో కూడా AI కీలక పాత్ర పోషించే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అసలు సమస్య వైరస్‌లు కాదు…అది దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలు.