Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
World Cup 2027: వరల్డ్‌ కప్‌లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!

World Cup 2027: వరల్డ్‌ కప్‌లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!

NTV Telugu 2 weeks ago

2027 వన్డే ప్రపంచ కప్‌కు సంబంధించిన భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ పేసర్, స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్‌ను ప్రపంచకప్ జట్టులో తప్పకుండా ఎంపిక చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు.

2022 తర్వాత వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్న భువనేశ్వర్.. 2026 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. 28 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికాలో జరిగే 2027 వన్డే ప్రపంచ కప్‌లో భువనేశ్వర్ అనుభవం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. భువనేశ్వర్‌ను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అతడితో మాట్లాడి ఫస్ట్‌క్లాస్ క్రికెట్, విజయ్ హజారే ట్రోఫీ సహా అన్ని టోర్నీల్లో ఆడించాలి. ప్రపంచ కప్‌కు ముందు పూర్తి స్థాయిలో మ్యాచ్ ప్రాక్టీస్ కల్పిస్తే దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో అతడు జట్టుకు కీలక ఆయుధంగా మారతాడు’ అని పేర్కొన్నాడు. టీమిండియాకు ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మంచి బౌలర్ ఉన్నాడని, అతడికి భువీ కలిస్తే.. పేస్ బౌలింగ్ పటిష్టం అవుందని అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరు జట్టులో ఉంటే కప్పు కొట్టడం ఈజీనే అని, లేదంటే కష్టమే అని చెప్పుకొచ్చాడు.

ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌పై కూడా ఆర్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తొలి టెస్టులో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగాలి. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ముగ్గురికీ తుది జట్టులో చోటు కల్పించాలి. ఇటీవల ఇండియా-ఏ తరఫున శ్రీలంకలోని గాలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గాలే పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. అక్కడ ఇప్పటికే భారీ ఇన్నింగ్స్ ఆడిన అనుభవం అతడికి ఉంది. స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోగల సుదర్శన్ ఫిట్‌గా ఉంటే భారత జట్టుకు అదనపు బలమవుతాడు’ అని చెప్పుకొచ్చాడు.

శ్రీలంక టెస్టు సిరీస్‌కు రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులో చేరడం భారత జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మరోవైపు మానవ్ సుతార్ తన గత ప్రదర్శనతో జట్టులో స్థానం నిలబెట్టుకోగా.. కుల్దీప్ యాదవ్ కూడా అందుబాటులో ఉండడంతో భారత జట్టు స్పిన్ విభాగం మరింత బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనలో భారత్ ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu