తెలుగు తెరపై క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఆ క్రైమ్ కాన్సెప్ట్‌కు మైథాలజీ అంశాలను జోడిస్తే ప్రేక్షకులకు కలిగే కిక్కే వేరు. సరిగ్గా ఇదే ప్రయత్నంతో డెబ్యూ నటుడు జగదీశ్ ఆమంచి దర్శకుడిగా, నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం “యముడు”.
గరుడ పురాణం నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ
విశ్వ (జగదీశ్ ఆమంచి) ఒక అనాథ. ఓ వృద్ధాశ్రమం నడుపుతూ అను (శ్రావణి శెట్టి) అనే అమ్మాయిని ప్రేమించి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. మరోవైపు జగడ్ అనే యువ సంగీత దర్శకుడు, అతని మిత్రుడు ఆకాష్, హరిణి (అద్విక శర్మ)ల కథ నడుస్తుంటుంది. హరిణిని జగడ్ ప్రేమిస్తున్నప్పటికీ, ఆమె ఆకాష్‌తో రిలేషన్ లోకి వెళ్తుంది. అయితే జగడ్‌కి ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు వస్తుందని తెలిసాక, తన స్వార్థం కోసం ఆకాష్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక అదే సమయంలో ఆ ఊరిలో మహిళలే లక్ష్యంగా వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? కేవలం మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఈ హత్యల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? విశ్వ, జగడ్ కథలు ఎక్కడ కలిసాయి అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
సాధారణంగా సీరియల్ కిల్లర్ కథల్లో ఒకే తరహా హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ చిత్రంలో కిల్లర్ చేసే హత్యలకు గరుడ పురాణంలో చెప్పిన శిక్షలకు (పాపాలకు పడే శిక్షలు) ముడిపెట్టడం ఆసక్తికరం. క్రైమ్‌కు పురాణ కథలను, యముడి కాన్సెప్ట్‌ను జోడించడం వల్ల ప్రతి హత్య వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ మైథాలజికల్ యాంగిల్ వల్ల సాధారణ సీరియల్ కిల్లర్ టెంప్లేట్ పక్కకెళ్లి కొంచెం కొట్టగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కేవలం సీరియస్ మైండ్ గేమ్‌కే పరిమితం కాకుండా, వినోదానికి కూడా ప్రాధాన్యం ఇచ్చింది. అయితే కధలోకి వెళ్ళే వరకు కొంచెం లాగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఓ వైపు వరుస హత్యలతో నగరంలో భయాందోళనలు జరుగుతున్న వాతావరణాన్ని చూపిస్తూనే, మరోవైపు ప్రధాన పాత్రలైన విశ్వ-అనుల లవ్ స్టోరీని నడిపించిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్లో అసలు కథ వేగం పుంజుకుంటుంది వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ, కిల్లర్ అసలు మైండ్ సెట్ ఏంటి? హత్యలకు గురవుతున్న మహిళలకు, హంతకుడికి ఉన్న సంబంధం ఏంటి? అనే సీక్రెట్స్‌ను రివీల్ చేసే విధానం బాగుంది. క్లైమాక్స్ కేవలం థ్రిల్లింగ్ రివీల్‌తో ముగిసిపోకుండా, సమాజంలో మహిళలు ఎదుర్కొంటుంది ఏంటి, వారికి ఎలాంటి మెసేజ్ అవసరమనేది ఎమోషనల్‌గా చెప్పడం కొంత బాగుంది.
నటీనటుల విషయానికి వస్తే ఒకేసారి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా త్రిపాత్రాభినయం చేసిన జగదీశ్ ఆమంచి తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ మినహా మిగిలిన భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించాడు. శ్రావణి శెట్టి తన పాత్రకు న్యాయం చేయగా, అద్విక శర్మ గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. ఆకాశ్ చల్లా ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. భవాని రాకేష్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ దృశ్యాలను గ్రాండ్‌గా చూపించడంలో సక్సెస్ అయింది. శివ కుంద్రపు స్క్రీన్ ప్లేకి తోడు, యముడి కాన్సెప్ట్ ఆధారంగా రాసిన సంభాషణలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
చివరిగా గరుడ పురాణం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ‘యముడు’.. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చొచ్చు.

