Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Delhi Clubs: బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి.. మోదీ ఉక్కుపాదం!

Delhi Clubs: బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి.. మోదీ ఉక్కుపాదం!

Oktelugu.com 4 days ago

Narendra Modi: కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో ప్రస్తావనకు వచ్చిన ఒక లేడీ ప్రొఫెసర్‌ మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభుత్వాలు, సీఎంలు, మంత్రులు మారుతుంటారు.

కానీ నిజమైన అధికారం మాత్రం తమ చేతుల్లోనే ఉంటుందని, తాము చెప్పినట్టే వ్యవస్థ నడుస్తుందని ఆమె చెప్పినట్టు ఆ ఫైల్స్‌ సూచిస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్న ఒక లోతైన సామాజిక, అధికార నిర్మాణాన్ని సూచిస్తోంది. బ్రిటిష్‌ కాలంలో ఆంగ్లేయులకు తొత్తులుగా మారిన జమీందార్లు, జాగీర్దార్లు, అధికార వర్గం స్వాతంత్య్రం తర్వాత కూడా అదే వైఖరిని కొనసాగించింది. దేశానికి కాకుండా, తమ అధికార వర్గానికి సేవ చేస్తూ, తమ ప్రత్యేక హోదాను నిలబెట్టుకున్నారు. ఈ వర్గాన్నే లుటియన్స్‌ ఢిల్లీ అని పిలుస్తారు. కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మారినప్పుడు నిర్మించిన భవనాలు, క్లబ్‌లు, రేస్‌ కోర్సులు ఇప్పటికీ ఆ వర్గం గుర్తులుగా నిలిచి ఉన్నాయి.

ఖాన్‌ మార్కెట్‌ గ్యాంగ్‌..
మోదీ 2014కు ముందు ఎన్నికల ప్రచారంలో ఖాన్‌ మార్కెట్‌ గ్యాంగ్‌ అన్న పదం వాడారు. ఢిల్లీలోని ధనిక, ఆంగ్లేయుల కాలం నుంచి అధికారానికి దగ్గరగా ఉన్న వర్గం తమ అభిప్రాయాలను దేశం మొత్తం మీద రుద్దుతుందని, తామే దేశాన్ని నడిపిస్తున్నట్టు భావిస్తుందని ఆయన సూచించారు. ఇది కేవలం భౌగోళిక ప్రాంతం కాదు. ఒక ఆలోచనా వ్యవస్థ, ఒక సామాజిక నెట్‌వర్క్‌. ఇంటలెక్చువల్‌ సర్కిల్స్, మీడియా, బ్యూరోక్రసీలోని కొన్ని వర్గాలు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా కనిపిస్తాయి. ఈ వర్గం బ్రిటిష్‌ వారసత్వాన్ని సంరక్షించడం ద్వారా తమ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. స్వాతంత్య్రం వచ్చినా ఆ చిహ్నాలు కొనసాగడం దీనికి నిదర్శనం.

బానిసత్వ చిహ్నాలపై చర్యలు..
మోదీ ప్రభుత్వం ఇటీవల ఢిల్లీలోని కొన్ని ప్రముఖ క్లబ్‌లు, గ్రౌండ్‌లపై చర్యలు చేపట్టింది. చారిత్రక బానిసత్వ చిహ్నాలను తొలగించి, విలువైన భూమిని ప్రజోపయోగానికి మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఢిల్లీ రేస్‌ క్లబ్‌ ఒకటి. 53.24 ఎకరాల స్థలం ఉంది. 1924లో లీజుకు ఇచ్చిన భూమి. లీజు గడువు 1994లో ముగిసినా సంవత్సరాల తరబడి కొనసాగింది. 2024 ఆగస్టు 11న ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చింది. ఆగస్టు 27న స్వాధీనం చేసుకుని సెంట్రల్‌ పీడబ్ల్యూడీకి అప్పగించారు. ఇక జెపూర్‌ పోలో గ్రౌండ్‌కు కూడా 2024 మేలో నోటీసులు ఇచ్చింది. లీజు గడువు ముగియడంతో 15.2 ఎకరాలపై నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. అయినా జూన్‌లో బుల్డోజర్లతో స్వాధీనం. ఇక ఢిల్లీ జింఖానాకు చెందిన 27.3 ఎకరాలు సర్దార్‌జంగ్‌ రోడ్‌పై ఉంది. నోటీసులు జారీ. కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. రిటైర్డ్‌ సైనికాధికారులు కొనసాగించాలని కోరుతున్నారు. సెంట్రల్‌ సెక్రటేరియేట్‌ క్లబ్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. 2024 జూలైలో నోటీసులు ఇచ్చింది. ఇది కూడా కోర్టు వ్యవహారం కొనసాగుతోంది. ఈ స్థలాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి భవన్, పార్లమెంటుకు సమీపంలో ఉన్న విలువైన భూమి. ఇప్పటివరకు గుప్పెడు మంది చేతుల్లో ఉండిపోయిన ఈ భూమిని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ఇంపీరియల్‌ మనస్తత్వం..
ఈ చర్యలను కేవలం క్లబ్‌లు కూల్చడంగా చూడటం సరైనది కాదు. ఇది ఒక లోతైన చారిత్రక, సామాజిక మార్పుకు సంకేతం. బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతున్న ప్రత్యేక హక్కుల వ్యవస్థను సవాలు చేయడం. స్వాతంత్య్రం వచ్చినా కొనసాగిన ఇంపీరియల్‌ మనస్తత్వాన్ని ప్రశ్నించడం. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని సమర్థించే వర్గాలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ బానిసత్వ చిహ్నాలను కాపాడాలని కోరడం విరుద్ధంగా కనిపిస్తుంది. ఇది ఆలోచనా వైరుధ్యాన్ని చూపిస్తుంది. ఇక ఖాన్‌ మార్కెట్‌లోని అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలు తొలగించడం కూడా ఇదే ధోరణిలో భాగం. ఒకప్పుడు ఇంటలెక్చువల్‌ సెంటర్‌గా పరిగణించబడిన ప్రాంతం ఇప్పుడు చట్టపరమైన చర్యలకు లోనవుతోంది. అయినా ప్రధాన వర్గాల నుంచి పెద్దగా ప్రతిఘటన రావడం లేదు. ఇది కూడా గమనార్హం.

ప్రభుత్వాలు మారుతాయి. కానీ సిస్టం మాత్రం కొనసాగుతుందన్న భావనకు ఈ చర్యలు సవాల్‌ వేస్తున్నాయి. విలువైన భూమిని ప్రజలకు తిరిగి ఇవ్వడం, బానిసత్వ చిహ్నాలను తొలగించడం, ప్రత్యేక హక్కుల వ్యవస్థను సవాలు చేయడం ఒక కొత్త దిశను సూచిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com