Nauhera Shaik: సాధారణంగా భారతీయ మహిళలు చాలా పొదుపు చేస్తూ ఉంటారు. అనవసరంగా ఖర్చు పెట్టరు. ఒకవేళ ఖర్చుపెట్టినా దాని వెనక ఎంతో ఆలోచిస్తూ ఉంటారు.
పైసా పైసా కూడబెట్టడంలో వారి తర్వాత ఎవరైనా. ప్రపంచంలో ఎవరైనా పొదుపు పాఠాలు నేర్చుకోవాలంటే ముందుగా చూసేది భారతీయ మహిళల వైపే. మనదేశంలో గ్రామీణ ప్రాంతాలు.. పట్టణ ప్రాంతాలు.. నగర ప్రాంతాలు.. ఇలా ఏవైనా సరే.. ప్రతి ఇల్లు ఆర్థిక స్థిరత్వం సాధించడంలో మహిళలదే కీలకపాత్ర.
మహిళలందరూ మహారాణులు కాదనట్టుగా.. పొదుపు చేసే మహిళలు అందరూ మంచివాళ్ళు కాదు. ఇందులో ముంచేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇలా ముంచే వాళ్లలో ఈమె ఏకంగా పిహెచ్డి చేసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 5,978 కోట్లను సేకరించింది.. కాదు కాదు.. అన్ని కోట్లకు అందరిని ముంచింది. ఈమె చేసిన వ్యవహారం మనదేశ ఆర్థిక రంగంలోనే అతిపెద్ద కుంభకోణం. దీనికోసం ఆమె భారీగా ప్రచారం చేసుకోలేదు. పెద్ద ఎత్తున కార్యాలయాలు తెరవలేదు. కేవలం.. ఒక మాట చెప్పింది. తెలివైన ఎత్తుగడ వేసింది.
హీరా గ్రూప్ పేరుతో నౌహెరా షేక్ అనే మహిళ.. వడ్డీ లేని ఇస్లామిక్ వ్యాపారాన్ని మొదలుపెట్టి. దీనిని హలాల్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తుంటారు. దీని పేరుతో బంగారం.. టెక్స్టైల్స్.. రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టుబడి పెట్టాలని చాలామంది ప్రజలను ఆకర్షించింది. ఏకంగా ప్రతి ఏడాది 36% లాభాలు అందజేస్తామని ప్రకటించింది. ఇలా ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు సేకరించింది. వేలకోట్లను తన సొంత బంధువులు.. తన పేరు మీద మళ్లించుకుంది. విదేశాలలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసింది.
ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్లకు లాభాలు చూపించకపోవడం.. డబ్బు అడిగితే సమాధానం చెప్పకపోవడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో వారు ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. మొదట్లో పోలీసులు ఈ వ్యవహారాన్ని చిన్న కేసు గానే భావించారు. ఆ తర్వాత లోతుల్లోకి వెళితే వారికే దిమ్మ తిరిగిపోయింది. ఒకటి కాదు రెండు కాదు 5978 కోట్లకి పైగా నిధులను సేకరించారు. ఈమె ఆంధ్ర ప్రదేశ్.. తెలంగాణ.. కేరళ రాష్ట్రాలలో భారీగా నిధులు సేకరించారు. వీటిని పక్కదారి పట్టించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు సంబంధించిన దాదాపు 428 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.. అయితే నౌహెరా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు…. రాజకీయ నాయకురాలు కూడా.. ఈమె ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీకి అధ్యక్షురాలు. ఈ పార్టీని ఈమె స్థాపించారు..
నౌహెరా ఆర్థిక మోసానికి పాల్పడిన నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం ఈ నెల 19న కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు నౌహెరా కు సంబంధించిన 159 కోట్ల విలువైన 23 ఆస్తులకు వేలం వేశారు. ఇలవేల మీదగా వచ్చిన మొత్తాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మోసపోయిన వారికి తిరిగి చెల్లించబోతున్నారు. దీనికంటే ముందు సుప్రీంకోర్టు నౌహెరా బెయిల్ రద్దు చేసింది. అయితే ఆమె అధికారుల నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల నకిలీ పత్రాలు రూపొందించింది. నకిలీ గుర్తింపు పత్రాలతో హర్యానాలో తలదాచుకుంది. అయితే గత నెల 21న అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె హైదరాబాదులో జైల్లో ఉన్నారు. ఈ ఆస్తులను వేలం వేసే ప్రక్రియను నిరోధించడానికి నౌ హేరా పర్సనల్ అసిస్టెంట్ అన్సారి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తే.. ఆమెను కూడా ఈడి అధికారులు అరెస్ట్ చేశారు.

