Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్ని గంటలైనా షాపింగ్ చేయండి.. మీ బ్యాగులు మేము మోస్తాం.. ఇది యాపారం

ఎన్ని గంటలైనా షాపింగ్ చేయండి.. మీ బ్యాగులు మేము మోస్తాం.. ఇది యాపారం

Oktelugu.com 2 days ago

Delhi Shopping Bag Carrier Service: ముంబైలో డబ్బా వాలాలు ఉంటారు. వీరు సైకిళ్లకు క్యారేజీ బాక్సులు కట్టుకొని పెద్దపెద్ద ఆఫీసులకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి రాసిన పేరున్న వ్యక్తికి క్యారేజ్ బాక్స్ ఇచ్చి వస్తారు.

ఇలా ఇచ్చినందుకు ప్రతినెల కొంతమేర రుసుము వసూలు చేస్తారు. చదువుతుంటే ఇది చిన్న వ్యవహారం లాగానే ఉంటుంది. కానీ ముంబై నగరంలోనే కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కేవలం క్యారేజి బాక్స్ ఇచ్చి రావడాన్ని చాలామంది ఆదాయ వనరుగా రూపొందించుకున్నారు. దీని ఆధారంగా వందలాది కుటుంబాలు బతుకుతున్నాయి. డబ్బా వాలాలు ముంబై నగరంలో యూనియన్ గా ఏర్పడ్డారంటే అక్కడ వ్యాపార స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముంబైలో డబ్బా వాలాలు కేవలం ఉదాహరణ మాత్రమే.. ఇలా మనిషి అవసరాలు ఆధారంగా సాగే వ్యాపారాలు చాలా ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో ఈ కామర్స్ వ్యాపారం జరుగుతుంది కూడా ఇదే విధంగానే. ఇప్పుడు ఢిల్లీలో ఒక వ్యాపారం మొదలైంది. అది సంచలనం రేపుతోంది.. చాలామందికి ఉపాధి కల్పిస్తోంది. వాస్తవానికి ఇటువంటి వ్యాపారం ఒకటి ఉంటుందని.. దీనిని వ్యాపారం లాగా చేస్తారని ఎవరూ ఊహించలేదు. చివరికి ఈ వ్యాపారం ఇప్పుడు చాలామందికి ఆదాయ మార్గం.. అంతేకాదు మహిళలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటున్నది.

ఆడవాళ్ళ షాపింగ్ అంటే మగవాళ్ళు ఆమడ దూరం పారిపోతారు. ఎందుకంటే ఆడవాళ్లు ప్రతి వస్తువును కూడా అత్యంత జాగ్రత్తగా చూసి కొనుగోలు చేస్తారు. దీనికోసం చాలా సమయం పడుతుంది. పైగా డబ్బులు చెల్లించే విషయంలో బేరాలు ఆడుతుంటారు. అలాంటప్పుడు ఎక్కువ సమయం షాపింగ్ కోసం కేటాయించాల్సి వస్తుంది. ఇలాంటి అప్పుడు మగవాళ్ళల్లో సహనం చచ్చిపోతుంది. అందువల్లే షాపింగ్ చేసేటప్పుడు ఆడవాళ్ళతో వెళ్లడానికి ఇష్టపడరు. అయితే ఢిల్లీలో క్యారీ మ్యాన్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటయింది. ఈ కంపెనీ వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసే మహిళలకు, యువతులకు వారి సరంజామాను మోయడానికి కొంతమంది మనుషులను అందుబాటులో ఉంచుతుంది . గంటకు 169 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటుంది. బ్యాగుల బరువు ఆధారంగా వసూలు చేసే ఫీజు మారుతూ ఉంటుంది. అంతేకాదు బ్యాగులు మోసే వ్యక్తులు సరదాగా ఉంటారు. ఆడవాళ్లు షాపింగ్ మొత్తం పూర్తి చేసుకునేదాకా అక్కడే ఉంటారు. ఆ తర్వాత వారి సామాగ్రిని భద్రంగా ఇంటి వద్దకు చేర్చుతారు.

ప్రయాణ ఖర్చులు మొత్తం కస్టమర్లే భరించాల్సి ఉంటుంది. కేవలం వారు బ్యాగులు మాత్రమే మోస్తారు. ఒకవేళ బ్యాగుల బరువు అదనంగా ఉంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ముఖ్యంగా వివాహితలకు.. యువతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్లే ఈ అవకాశాన్ని తీసుకొచ్చామని క్యారీ మ్యాన్ నిర్వాహకులు చెబుతున్నారు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని.. పెద్దగా శ్రమ పడకుండానే డబ్బులు సంపాదించవచ్చని పేర్కొంటున్నారు. ఢిల్లీలో మొదలైన ఈ కంపెనీ కార్యకలాపాలు.. దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఏదైనా అవసరాల ఆధారంగానే వ్యాపారం మొదలవుతుంది. ఆ వ్యాపారం కనుక ఆదరణ పొందితే లాభాల పంట పండుతుంది. ప్రస్తుతం క్యారీ మ్యాన్ కంపెనీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. చిన్నగా మొదలైన ఈ కంపెనీ అత్యంత తక్కువ సమయంలో విశేషమైన పేరు తెచ్చుకుంది. వచ్చే రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com