IND vs AFG:మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా ఆల్రెడీ రెండు మ్యాచ్లు గెలిచింది. సిరీస్ సొంతం చేసుకుంది. దీంతో గురువారం జరిగే మూడో మ్యాచ్ మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు.
కనీసం ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని.. గెలిచి పరువు కాపాడుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ జట్టు భావించింది. కానీ ఆ జట్టు ఆశలను అడియాసలు చేశాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ.
గురువారం ఢిల్లీ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు సంజు శాంసన్(28*), అభిషేక్ శర్మ (76*) మెరుపు ఆరంభం ఇచ్చారు. ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా తొలి వికెట్ కు ఏకంగా 104 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. అది కూడా కేవలం 6.2 ఓవర్లలో.. 16.42 రన్ రేట్ తో టీమిండియా బ్యాటర్లు పరుగులు చేస్తుంటే.. ఆఫ్గనిస్తాన్ బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు.
అభిషేక్ అదరగొట్టాడు
ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు వేగతో బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఏ బౌలర్ ను కూడా వదిలిపెట్టకుండా అతడు వీర విహారం చేశాడు. అతడి ఖాతాలో 8 ఫోర్లు.. 7 సిక్సర్లు ఉన్నాయంటే.. బ్యాటింగ్ ఏ స్టైల్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నామా.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నామా అన్నట్టుగా ప్రేక్షకులకు సందిగ్ధాన్ని కలిగించాడు. తనకు మాత్రమే సాధ్యమైన డేరింగ్ బ్యాటింగ్ తో అభిషేక్ శర్మ ఆకట్టుకున్నాడు..
ప్లాట్ మైదానం కావడం.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల బౌలింగ్ లో పస లేకపోవడంతో అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. వీర విహారం చేశాడు. తనకు మాత్రమే సాధ్యమైన దూకుడు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ కథనం రాసే సమయం వరకు అభిషేక్ శర్మ ఇంకా ఆడుతూనే ఉన్నాడు. సెంచరీకి మరో 20 పరుగుల దూరంలో ఉన్నాడు. అది గనక పూర్తి చేస్తే అరుదైన ఘనతను తన పేరు మీద లిఖించుకుంటాడు అభిషేక్ శర్మ. ఇప్పటికే తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి అభిషేక్ శర్మ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా అదే జోరు చూపించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసి పర్యాటక జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు.

