Jagan Mohan Reddy: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వింత వైఖరి. ఆయన ప్రజల మధ్యకు రారు. అసెంబ్లీకి వెళ్ళరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ పోరాటం చేస్తోందని మాత్రం ప్రకటనలు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది కనుక.. ఇక తనదే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. వారాంతపు ప్రెస్ మీట్ లు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఇంగ్లీషులో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హలో ఇండియా అంటూ ప్రారంభిస్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రస్థాయిలో చంద్రబాబు సర్కార్ పై విరుచుకుపడుతున్న ఆయన.. జాతీయస్థాయిలో అంశాలపై మాత్రం స్పందించనని చెబుతున్నారు. అయితే ఒక వైపు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ పై మాట్లాడాలని ఉంది. కానీ మాట్లాడలేకపోతున్నారు. ఇండియా కూటమి ఏపీ పాలనపై పట్టించుకోవడం లేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి.
* కాంగ్రెస్ గూటికి..
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కొనసాగుతూ వచ్చింది. అయితే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పుకోలేదు. కానీ ఒక్కో ప్రాంతీయ పార్టీని కబళిస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం కోసం అవన్నీ ఎదురుచూస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత ఎత్తుకు ఎగిరేవారు మమతా బెనర్జీ. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ శరణు కోరారు. తన సొంత ఇమేజ్తో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ పరిస్థితి అలా ఉంటే.. కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛతో వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన అకాల మృతితో వచ్చిన సానుభూతితో అధికారంలోకి రాగలిగారు జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా జగన్ సైతం కాంగ్రెస్ గూటికి వెళ్లాల్సిందే. కానీ కేసుల భయంతో బిజెపితో పరోక్ష స్నేహం కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే తటస్థ వైఖరి అంటూ మాట్లాడుతున్నారు. ఏపీ గురించి ఇండియాకుటమి అస్సలు పట్టించుకోవడం మానేసింది.
* దూరం పెడుతున్న బిజెపి..
మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం తన రూటు మార్చింది.. ఒకవైపు బాబుతో స్నేహం చేసి మరోవైపు జగన్తో పరోక్ష స్నేహం కొనసాగిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆ పార్టీకి తెలుసు. అందుకే ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేయడం ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతూ వస్తోంది. అలాగని నేరుగా ఇండియా కూటమికి వెళ్లే పరిస్థితి జగన్ వద్ద లేదు. అందుకే జాతీయ బిజెపిపై మాట్లాడను అంటున్నారు జగన్.. ఇప్పుడు హలో ఇండియా అని వ్యాఖ్యానించడం ద్వారా ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు వచ్చి తనకు సహకరించాలి అన్నట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ ట్వీట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

