Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్యం సేవించి ఆహారం తినకుండా నిద్రిస్తే ఎంత ప్రమాదమో తెలుసా..

మద్యం సేవించి ఆహారం తినకుండా నిద్రిస్తే ఎంత ప్రమాదమో తెలుసా..

Oktelugu.com 4 days ago

Alcohol On Empty Stomach: ప్రస్తుత కాలంలో చాలా మంది యువత రాత్రిళ్లు మద్యం సేవించి భోజనం చేయకుండా నిద్రపోతున్నారు. ఇది ప్రమాదకర అలవాటుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మద్యం సేవించి ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో నిద్రపోవడం వల్ల శరీరంపై ఆల్కహాల్ ప్రభావం మరింత వేగంగా పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా జీర్ణాశయం, కాలేయం, నరాల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి అని చెబుతున్నారు. అసలు మద్యం సేవించి తినకుండా నిద్రిస్తే ఇంకా ఏం జరుగుతాయంటే?

మద్యం తాగిన తర్వాత ఆహారం తీసుకోకపోతే జీర్ణాశయంలో ఉండే సహజ రక్షణ పొర క్రమంగా దెబ్బతింటుంది. సాధారణంగా ఈ పొర కడుపులో ఉత్పత్తయ్యే యాసిడ్ నుంచి లోపలి చర్మాన్ని కాపాడుతుంది. కానీ ఆల్కహాల్ ఆ రక్షణ పొరను కరిగించడంతో యాసిడ్ నేరుగా జీర్ణాశయ గోడలను తాకి మంట, గాయాలు కలిగిస్తుంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి.

వైద్య నిపుణుల ప్రకారం.. ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల రక్తనాళాలు కూడా బలహీనపడతాయి. కొంతమందిలో వాంతులు, రక్త వాంతులు, కడుపులో బ్లీడింగ్ వంటి ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తాయి. దీర్ఘకాలం ఇలా కొనసాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా కేన్సర్‌కు కూడా దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మద్యం ప్రభావం ఎక్కువగా పడే అవయవం కాలేయం. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకుంటే అది చాలా వేగంగా రక్తంలో కలిసిపోతుంది. దీంతో కాలేయంపై అధిక ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, లివర్ సిరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కాలేయం పూర్తిగా పనిచేయకపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.

అలాగే రాత్రిళ్లు మద్యం సేవించి వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు పనితీరుపైనా ప్రభావం పడుతుంది. మొదట్లో మద్యం వల్ల త్వరగా నిద్ర వచ్చినట్టు అనిపించినా, అది నాణ్యమైన నిద్ర కాదు. మధ్యరాత్రిలో పలుమార్లు మేల్కొనడం, ఉదయం అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో మానసిక ఆందోళన, డిప్రెషన్ ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోవచ్చు. దీనివల్ల తలనిర్మళం, చెమటలు, బలహీనత, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మధుమేహ రోగుల్లో ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు.

వైద్య నిపుణులు చెబుతున్నదేమిటంటే, మద్యం సేవించకపోవడమే ఆరోగ్యానికి ఉత్తమ మార్గం. అయినప్పటికీ అలవాటు ఉన్నవారు కనీసం ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవద్దని సూచిస్తున్నారు. మితంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీరు తాగడం, తరచూ మద్యం సేవించకుండా ఉండడం ద్వారా కొంతవరకు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com