Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటితరం ఆడపిల్లలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు..

నేటితరం ఆడపిల్లలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు..

Oktelugu.com 1 week ago

Why Girls Mature Early: వాతావరణం మార్పులతో కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మనం తినే ఆహారం, వీచే గాలి కలుషితం కావడంతో చిన్న వయసులోనే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా ఆడపిల్లల్లో రుతుక్రమం ప్రారంభమయ్యే వయస్సు క్రమంగా తగ్గిపోతుండటం వైద్య నిపుణులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో సాధారణంగా 13 నుంచి14 ఏళ్ల వయస్సులో ప్రారంభమయ్యే రుతుక్రమం, ప్రస్తుతం చాలా మంది బాలికల్లో 11 నుంచి12 ఏళ్ల వయస్సుకే మొదలవుతోంది. అసలు ఈ సమస్యలు కావడానికి కారణం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కొన్ని పరిశోధనల ప్రకారం …2000 తర్వాత జన్మించిన బాలికలు సగటున 11.9 ఏళ్ల వయస్సులోనే యుక్తవయస్సు దశలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అందుకు ఆధునిక జీవనశైలి ఈ మార్పులకు ప్రధాన కారణంగా వైద్యులు భావిస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎక్కువసేపు ఇంట్లోనే గడపడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, రుతుక్రమం త్వరగా ప్రారంభమయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా బాలికల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాతావరణంలో ఉండే కొన్ని రసాయన కణాలు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి యుక్తవయస్సు దశను ముందుగానే ప్రారంభించే ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల్లో మిగిలిపోయే పురుగుమందుల అవశేషాలు కూడా ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ రసాయనాల్లో కొన్ని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ (Endocrine Disruptors) గా పనిచేస్తాయి. అంటే ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసి ఎదుగుదల ప్రక్రియను వేగవంతం చేయగలవు.

శారీరకంగా త్వరగా మెచ్యూర్ కావడం మాత్రమే కాదు, దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. చిన్న వయస్సులోనే శరీరంలో మార్పులు రావడంతో కొందరు బాలికలు ఆందోళన, ఆత్మన్యూనత భావం, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, ఈ మార్పుల గురించి అవగాహన కల్పించడం అవసరం.

తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలకు సమతుల ఆహారం అందించడం, రోజూ వ్యాయామం లేదా ఆటలు ఆడేలా ప్రోత్సహించడం, జంక్ ఫుడ్‌ను తగ్గించడం, పండ్లు-కూరగాయలను బాగా శుభ్రపరిచి ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిల్లల్లో రుతుక్రమం, శారీరక ఎదుగుదల, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మార్పులను గమనిస్తూ అవసరమైతే పిల్లల వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

అయితే ప్రతి బాలికలో త్వరగా రుతుక్రమం ప్రారంభమవడం అనేది తప్పనిసరిగా వ్యాధి సంకేతం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జన్యుపరమైన అంశాలు, కుటుంబ నేపథ్యం, పోషకాహారం వంటి అనేక అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. కానీ చాలా చిన్న వయస్సులోనే యుక్తవయస్సు లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్య సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com