Pakistan Terrorism Links: కొంతకాలంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ మీద దారుణంగా విరుచుకుపడుతోంది.
ఆఫ్ఘనిస్తాన్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం తీవ్రంగా చోటుచేసుకుంటున్నది. ముఖ్యంగా చిన్నారులు.. వృద్ధులు ఎక్కువగా చనిపోతున్నారు.
పాకిస్తాన్ పదే పదే దాడి చేయడం.. అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ కూడా గట్టిగా సమాధానం చెబుతోంది. ఇటీవల పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో దాడులు జరిపింది. రాత్రిపూట వైమానిక దాడులు కూడా చేసింది. వైమానిక దాడులు చేస్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన ఆఫ్గనిస్తాన్.. ఈసారి ఏకంగా సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీంతో పాకిస్తాన్ కు దిమ్మ తిరిగిపోయింది.
పాకిస్థాన్లో కీలకమైన కైబర్ పంక్తుక్వా, బలూచిస్తాన్ ప్రాంతాలలో ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసింది. డ్రోన్లతో పాకిస్తాన్ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఆఫ్గనిస్తాన్ దాడులు చేసింది.. ఐసిస్, లస్కరే తోయిబా వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదుల శిబిరాలు ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో నేలమట్టమైనట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ దాడులకు ఇక్కడి నుంచే ప్రణాళికలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద గ్రూప్లతో కలిసి ఆఫ్గనిస్తాన్ దేశం మీద దాడులు చేస్తున్నదని తెలుస్తోంది.
ఇన్నాళ్లపాటు పాకిస్తాన్ ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచింది.. ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్స్ తో దాడులు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. దీనిని అంతర్జాతీయ సమాజం ముందు ఆఫ్ఘనిస్తాన్ ఆధారాలతో సహా ఉంచింది. దీంతో పాకిస్తాన్ దేశానికి మరోసారి అంతర్జాతీయంగా తలవంపులు ఎదురయ్యాయి. ఇప్పటివరకు ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉంటుంది. అదేవిధంగా బుకాయింపులకు దిగుతూ ఉంటుంది. కానీ, ఆఫ్ఘనిస్తాన్ చేసిన డ్రోన్ దాడులతో.. పాకిస్తాన్ ఉగ్రముఖ చిత్రం మరోసారి బయటపడింది. మరి దీనిపై అంతర్జాతీయ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

