Sleeping With Lights On: రాత్రి సరైన నిద్ర పట్టడానికి కొందరు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరు చిమ్మ చీకట్లో నిద్ర పోవాలని చూస్తే.. మరికొందరు లైట్లు వేసుకొని నిద్రిస్తారు.
అయితే లైట్ వేసుకొని నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలా చేయడం వల్ల మెలటిన్ విడుదలలో సమస్యలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది?
మెలటోనిన్ అనేది మెదడులోని పీనియల్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్. రాత్రి నిద్రపోయే ముందు గదిలో చీకటి పడినప్పుడు దీని ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శరీరానికి 'ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం' అనే సంకేతం అందుతుంది. అయితే ఉదయం వెలుతురు పెరిగినప్పుడు మెలటోనిన్ స్థాయులు తగ్గుతూ మనలో మెలకువ, చురుకుదనం పెరుగుతాయి. అందుకే వెలుతురు, చీకటిలు నిద్ర, మెలకువ సమయాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రాత్రి నిద్రపోయే ముందు గదిలో లైట్ ఆన్ చేసి ఉంటే.. మన కళ్లకు కాంతి తగిలినప్పుడు మెదడుకు అది ఇంకా పగటి సమయమే అన్న సంకేతాన్ని ఇవ్వవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా ఇళ్లల్లో ప్రకాశవంతమైన లైట్లు, LED లైట్లు ఉంటున్నాయి. వీటినుంచి నుంచి వచ్చే కాంతి మెలటోనిన్ విడుదలను అణచివేసే అవకాశం ఉంది. ఫలితంగా నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో జీవ గడియారం దెబ్బతింటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జీవ గడియారం అనగా.. మన శరీరంలో సర్కేడియన్ క్లాక్ ఉంటుంది. ఇది రోజంతా పనిచేస్తుంది. ఇది నిద్ర, మెలకువ మాత్రమే కాకుండా శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ విడుదల, ఆకలి, అప్రమత్తత వంటి అనేక ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. వెలుతురు, చీకటి వంటి పర్యావరణ సంకేతాలు ఈ గడియారాన్ని సరైన సమయానికి సెట్ చేయడంలో విఫలమైతే మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది.
రాత్రిపూట కాంతి మెలటోనిన్ వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా హార్మోన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. పడుకునే ముందు గది వెలుతురుకు గురైన వారిలో మెలటోనిన్ ఉత్పత్తి ఆలస్యమవడం, దాని వ్యవధి తగ్గడం గమనించారు. అయితే లైట్ ఆన్ చేసి ఒక్క రాత్రి నిద్రపోవడంతోనే హార్మోన్ల సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుందని కాదు.. కానీ తరచూ ఇలా చేయడం వల్ల సమస్యలు ఉంటాయని అంటున్నారు.

