Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

5222-crore-dpr-delay-budameru-oparation పైళ్లల్లో రెండేళ్ల నిద్ర Andhra Prabha Exclusive Story

Babu Bahadur September 1, 2026Andhra Pradesh Floods, budameru

5222-crore-dpr-delay-budameru-oparation పైళ్లల్లో రెండేళ్ల నిద్ర Andhra Prabha Exclusive Story

  • డీపీఆర్ పళ్లిగిలింత
  • లెక్కల్లో రూ.5, 222 కోట్లు
  • మాటల్లోనే ఆపరేషన్‌ బుడమేరు
  • అవే ఆక్రమణలు
  • హీన స్థితిలోనే గట్లు….
  • రెగ్యులేటర్లు అదే దైన్యం..
  • 15 వేల క్యూసెక్కులకే డైవర్షన్ పరిమితం..
  • మరపురాని బుడమేరు విలయం

(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ )

బుడమేరు.. ఒకప్పుడు కృష్ణా డెల్టాకు జీవనాడి. విజయవాడకు తాగునీటిని అందించిన జలవనరు. ఇప్పుడు అదే బుడమేరు నగరానికి ముంపు ముప్పుగా మారింది. ఆక్రమణలతో కుంచించుకుపోయిన ప్రవాహ మార్గం, బలహీనమైన గట్లు, పాతబడిన రెగ్యులేటర్లు, అసంపూర్తిగా ఉన్న రక్షణ పనులు.. భారీ వర్షం వస్తే విజయవాడ ప్రజలను వణికించే పరిస్థితిని తెచ్చాయి. రెండేళ్ల క్రితం నగరం చవిచూసిన వరద బీభత్సం ఇంకా కళ్లముందే ఉన్నా.. శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదించిన రూ.5,222 కోట్ల డీపీఆర్‌ ముందుకు సాగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో బుడమేరు ప్రళయం కోసం ఎదురుచూడకుండా సమగ్ర 'ఆపరేషన్‌ బుడమేరు'కు ప్రభుత్వం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.

విరుచుకు పడిన బుడమేరు….

ఎ.కొండూరు నుంచి విజయవాడ మీదుగా కొల్లేరు వరకు సుమారు 40 గ్రామాల పరిధిలో 2,930 ఎకరాల్లో బుడమేరు పరివాహక ప్రాంతం విస్తరించి ఉంది. సహజంగా 50 నుంచి 120 అడుగుల వెడల్పు ఉండాల్సిన ప్రవాహ మార్గం అనేక ప్రాంతాల్లో ఆక్రమణలతో 20-30 అడుగులకు కుదించుకుపోయింది. సహజ ప్రవాహ ప్రాంతంలో సుమారు 380 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు సైతం గుర్తించారు.

32 డివిజన్లు అతలాకుతలం .

2024 ఆగస్టు 31న భారీ వర్షాలకు బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌కు పలు చోట్ల గండ్లు పడటంతో విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని 32 డివిజన్లలో సుమారు 2.62 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. ఎనికేపాడు,కొల్లేరు మధ్య 50.6 కిలోమీటర్ల మేర గట్లకు గండ్లు పడగా.. వేల్పూరు వద్ద ఏర్పడిన భారీ గండి బుడమేరు రక్షణ వ్యవస్థ బలహీనతను బయటపెట్టింది.

కాలువలోనే కట్టడాలు..

విజయవాడలోని సింగనగర్‌ వంతెన పరిసరాల్లో బుడమేరు ప్రవాహ మార్గంలోనే నిర్మాణాలు వెలిశాయి. సింగనగర్‌, నందమూరినగర్‌, న్యూకరాజరాజేశ్వరీపేట, మిల్క్‌ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో సుమారు 80 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అంచనాలు ఉన్నాయి. దాదాపు 3,051 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీటిలో సుమారు 750 అపార్ట్‌మెంట్లు, 2,000 ఇళ్లు, 300 వరకు దుకాణాలు, వ్యాపార, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు చెబుతున్నారు.

…15 వేల క్యూసెక్కులే..

ప్రస్తుతం బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ సుమారు 15 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించగలదు. భారీ వరదలను దృష్టిలో ఉంచుకుని దీని సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచే ప్రతిపాదన ఉన్నా.. కార్యరూపం దాల్చలేదు. ఎనికేపాడు అండర్‌టన్నెల్‌ ద్వారా కనీసం 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించే పనులు కూడా వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.

….రైల్వే లైన్లతో అడ్డంకి…

విజయవాడ ఎగువ ప్రాంతాల్లోని రైల్వే లైన్లు కూడా కొన్ని చోట్ల వరదనీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి. రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాప్‌ పరిసరాల్లో నీరు వెళ్లేందుకు పరిమిత మార్గాలే ఉండటంతో భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అవసరమైన ప్రాంతాల్లో అదనపు నీటి పారుదల మార్గాలు ఏర్పాటు చేయాల్సి అవసరం ఎంతైనా ఉందని ఇటు ప్రజలు అటు రైతులు చెబుతున్నారు.

…రూ.5,222 కోట్ల డీపీఆర్‌..

బుడమేరుపై ఉన్న ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం, గట్ల పటిష్టీకరణ, రక్షణ పనులు తదితరాలకు సుమారు రూ.5,222 కోట్లతో సమగ్ర డీపీఆర్‌ సిద్ధమైనట్లు సమాచారం. అధిక వ్యయం కారణంగా ప్రాజెక్ట నో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి విపత్తు తర్వాత సహాయక చర్యలకు వేల కోట్లు వెచ్చించడం కంటే.. ముందుగానే శాశ్వత రక్షణ వ్యవస్థకు ఖర్చు చేయడం ప్రయోజనకరమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆపరేషన్‌ బుడమేరు'కు సమయం…

బుడమేరు పూర్తి ప్రవాహ మార్గాన్ని డిజిటల్‌ సర్వే చేసి హద్దులు నిర్ధారించాలి. ఆక్రమణలను దశలవారీగా తొలగించి, పేద నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలి. ఎనికేపాడు,కొల్లేరు మధ్య బలహీన గట్లను శాశ్వతంగా పటిష్టం చేయాలి. 1964 నాటి రెగ్యులేటర్లను ఆధునీకరించాలి. డైవర్షన్‌ ఛానల్‌ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచాలి. ఎనికేపాడు అండర్‌టన్నెల్‌ పనులను వేగవంతం చేయాలి. విజయవాడలో అవసరమైన రిటైనింగ్‌ వాల్స్‌, ప్రత్యామ్నాయ ఛానల్‌ ఏర్పాటు చేయాలి. రైల్వే లైన్ల వద్ద నీరు నిలవకుండా అదనపు పారుదల మార్గాలు నిర్మించాలి. గత ఆక్రమణల తొలగింపుతో పాటు ఇకపై బుడమేరు భూమిలో ఒక్క అంగుళం కూడా కొత్తగా ఆక్రమణకు గురికాకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రవాహ మార్గాన్ని డిజిటల్‌గా నమోదు చేసి హద్దులను ప్రజలకు స్పష్టంగా ప్రకటించాలి.

మరో వరద వచ్చే వరకు..

2024 బుడమేరు వరద విజయవాడకు ఇచ్చిన హెచ్చరికను ప్రభుత్వం మరచిపోకూడదు. నగరంతో పాటు ఎ.కొండూరు నుంచి కొల్లేరు వరకు బుడమేరు పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, రైతులు, ప్రజలను ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలి. వరద వచ్చిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం కంటే.. వరద రాకముందే ముంపును అడ్డుకునే వ్యవస్థను నిర్మించడమే అసలు బాధ్యత. రూ.5,222 కోట్ల డీపీఆర్‌ను అమలు చేసి 'ఆపరేషన్‌ బుడమేరు'ను ఇక ప్రకటనల్లో కాకుండా క్షేత్రస్థాయిలో ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News