Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భవిష్యత్ అవసరాలకు నీటిని నిల్వ చేయాలి..

భవిష్యత్ అవసరాలకు నీటిని నిల్వ చేయాలి..

Pavan Chandragiri August 1, 2026

కడెం, ఆంధ్రప్రభ : భవిష్యత్తు తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల్లో నీటిని ప్రణాళికాబద్ధంగా నిల్వ చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.

ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కూడిన మంత్రుల బృందం శనివారం కడెం ప్రాజెక్టును సందర్శించింది.

ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌), ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న నీటి పరిమాణం, ప్రస్తుత పరిస్థితులను మంత్రులకు వివరించారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి అవసరాలపై కూడా సమగ్ర సమాచారం అందించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి నిర్వహణకు శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నీటిమట్టాలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కడెం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటిమట్టం, నీటి నిల్వ సామర్థ్యం, సిల్టేషన్ సమస్యలు, నీటి పారుదల నిర్వహణపై మంత్రులకు వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్వహిస్తూ సాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రాజెక్టులో సిల్టేషన్ ప్రధాన సమస్యగా మారిందని, సుమారు 7.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో దాదాపు 50 శాతం వరకు పూడిక పేరుకుపోయినట్లు వివరించారు. దీనివల్ల నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నీటిమట్టం 674-675 మీటర్లకు చేరినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి విడుదల చేపట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. పూడిక సమస్యను దశలవారీగా తగ్గించి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన సాంకేతిక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ పర్యటనలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News