Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Gold Price Forecast Next Week | పసిడి ధరలు పరుగులు తీస్తుందా..? నేలచూపులు చూస్తుందా..?

Ramakanth Vuriti August 30, 2026Digital Gold Price, gold price forecast, Gold Price Next Week, MCX Gold Price, prabhanews.com, Spot Gold Price

Gold Price Forecast Next Week | పసిడి ధరలు పరుగులు తీస్తుందా..? నేలచూపులు చూస్తుందా..?

  • గరిష్ఠాల నుంచి కనిష్ఠం వైపు
  • ఫెడ్‌ వైఖరితో అమ్మకాలపై ప్రభావం
  • ఫెడ్‌ ఒక్క మాటతో మారిన మార్కెట్‌ సీన్‌!
  • అమెరికా ఉద్యోగ డేటానే అసలు గేమ్‌ ఛేంజర్‌

ఆగస్టు చివరి వారంలో బంగారం ధరలు గరిష్ఠాల నుంచి దిగొచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన వైఖరి, డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ బలపడటం, లాభాల స్వీకరణతో పసిడి అమ్మకాలు తగ్గాయి. ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో బంగారం ధరలు ఏ దిశగా కదులుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంసీఎక్స్‌లో రూ.1.55 లక్షల సపోర్ట్‌, రూ.1.60 లక్షల రెసిస్టెన్స్‌ కీలకంగా మారాయి. అంతర్జాతీయంగా 4,500 డాలర్ల స్థాయి, అమెరికా ఉద్యోగ గణాంకాలు పసిడి తదుపరి దిశను నిర్దేశించనున్నాయి. ఇదే సమయంలో డిజిటల్‌ గోల్డ్‌ ధరలపైనా అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం కనిపించనుంది. వచ్చే వారం బంగారం, డిజిటల్‌ గోల్డ్‌ ధరల పూర్తి విశ్లేషణ ఇదే.

Gold Price Forecast Next Week | ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్‌ ప్రతినిధి : పసిడి ధరల పరుగుకు ఆగస్టు చివరి వారంలో బ్రేక్‌ పడింది. వరుసగా పెరిగి నెల గరిష్ఠాలకు చేరిన బంగారం.. వారం చివర్లో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన వైఖరి, వడ్డీరేట్లపై మారిన అంచనాలు, డాలర్‌, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ బలపడటం, భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో పసిడిపై ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ స్పాట్‌ గోల్డ్‌ కూడా గణనీయంగా తగ్గడంతో దేశీయ మార్కెట్‌లోనూ ప్రతికూల ప్రభావం కనిపించింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంపైనే ఉంది. మరి పసిడి మళ్లీ పరుగులు తీస్తుందా..? లేక మరింత నేలచూపులు చూస్తుందా..?

గరిష్ఠాల నుంచి గిర్రున కిందకు!

ఆగస్టు 24న 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర సుమారు రూ.16,397 వద్ద ఉండగా.. ఆగస్టు 29 నాటికి రూ.15,824కు చేరింది. అంటే కేవలం ఐదు ట్రేడింగ్‌ రోజుల్లోనే గరిష్ఠ స్థాయి నుంచి సుమారు రూ.573 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం కూడా గ్రాముకు రూ.15,030 నుంచి రూ.14,505కు దిగింది.

తేదీ 24 క్యారెట్లు/గ్రాము 22 క్యారెట్లు/గ్రాము ధోరణి
ఆగస్టు 24 రూ.16,397 రూ.15,030 గరిష్ఠాల సమీపం
ఆగస్టు 26 రూ.16,375 రూ.15,010 దాదాపు స్థిరం
ఆగస్టు 28 రూ.16,113 రూ.14,770 తగ్గుదల
ఆగస్టు 29 రూ.15,824 రూ.14,505 భారీ పతనం

దేశీయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆగస్టు 25 న రూ.1,62,603 నుంచి వారం చివరికి సుమారు రూ.1,59,578కు తగ్గింది. ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ శుక్రవారం 1.63 శాతం క్షీణించి రూ.1,56,400కు చేరాయి.

ఫెడ్‌ ఒక్క మాటతో మారిన మార్కెట్‌ సీన్‌!

పసిడి పతనానికి ప్రధాన కారణాల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వైఖరి ఒకటి. ద్రవ్యోల్బణంపై కఠిన వైఖరి కొనసాగవచ్చన్న సంకేతాలతో అమెరికా వడ్డీరేట్ల తగ్గింపుపై మార్కెట్‌ అంచనాలు బలహీనపడ్డాయి.

ఫెడ్‌ రేట్లు అధికంగా కొనసాగితే అమెరికా డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌కు మద్దతు లభిస్తుంది. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై మాత్రం ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కొనుగోళ్లకు బదులుగా అమ్మకాలు పెరిగాయి.

లాభాల స్వీకరణ కూడా మరో కారణం

ఇటీవల పసిడి వేగంగా పెరిగి రికార్డు స్థాయిలకు చేరడంతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఫెడ్‌ నుంచి వచ్చిన కఠిన సంకేతాలు దీనికి ట్రిగ్గర్‌గా మారాయి. ఫలితంగా అంతర్జాతీయ స్పాట్‌ గోల్డ్‌లో భారీ కరెక్షన్‌ చోటుచేసుకుంది.

రేపటి నుంచి పసిడి ఎలా?

ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో పసిడి ఫ్లాట్‌ నుంచి స్వల్ప గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమై, అధిక ఒడిదుడుకులతో కదిలే అవకాశం ఉందని మార్కెట్‌ అంచనాలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుత పతనాన్ని చూసి బంగారం పూర్తిగా బేరిష్‌ ట్రెండ్‌లోకి వెళ్లిందని చెప్పలేం. ఇటీవల వచ్చిన భారీ పరుగుదల తర్వాత ఇది కరెక్షన్‌ దశ కావచ్చు. బంగారానికి దీర్ఘకాలికంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా రుణభారం వంటి అంశాలు ఇప్పటికీ మద్దతుగా ఉన్నాయి.

రూ.1.55 లక్షలు.. కీలక సపోర్ట్‌!

ఎంసీఎక్స్‌ గోల్డ్‌లో రూ.1,55,500-రూ.1,56,200 ప్రాంతం కీలక సపోర్ట్‌గా మారింది. ఈ స్థాయి నిలబడితే.. రూ.1,59,200 → రూ.1,60,000 వైపు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. అదే సపోర్ట్‌ దిగువకు జారితే కరెక్షన్‌ మరింత లోతుగా మారే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 4,470-4,500 డాలర్లు కీలక సపోర్ట్‌ జోన్‌గా, 4,600-4,630 డాలర్లు తక్షణ రెసిస్టెన్స్‌ ప్రాంతంగా చూడొచ్చు.

మార్కెట్‌ కీలక సపోర్ట్‌ కీలక రెసిస్టెన్స్‌
MCX Gold రూ.1,55,500-1,56,200 రూ.1,59,200-1,60,000
Spot Gold $4,470-4,500 $4,600-4,630

అమెరికా ఉద్యోగ డేటానే అసలు గేమ్‌ ఛేంజర్‌!

వచ్చే వారం పసిడి ధరల దిశను నిర్ణయించే ప్రధాన అంశం అమెరికా లేబర్‌ మార్కెట్‌ డేటా. ముఖ్యంగా Non-Farm Payrolls, నిరుద్యోగ రేటు, ADP ఉద్యోగ గణాంకాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి.

డేటా బలంగా వస్తే..

అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే సంకేతం వస్తుంది. ఫెడ్‌ వడ్డీరేట్లను అధిక స్థాయిలో కొనసాగించే అవకాశాలు పెరుగుతాయి. డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ బలపడితే బంగారంపై మరింత ఒత్తిడి రావచ్చు. డేటా బలహీనంగా వస్తే.. ఫెడ్‌ రేట్ల తగ్గింపుపై అంచనాలు పెరుగుతాయి. డాలర్‌ బలహీనపడే అవకాశం ఉంటుంది. బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గితే బంగారంలో మళ్లీ కొనుగోళ్లు రావచ్చు. అప్పుడు పసిడి వేగంగా రికవరీ అయ్యే అవకాశముంది. అమెరికా ఆగస్టు ఉద్యోగాల నివేదికలో సుమారు 45,000 ఉద్యోగాల పెరుగుదల ఉంటుందని మార్కెట్‌ అంచనా వేస్తోంది. వాస్తవ గణాంకం ఈ అంచనాకు ఎంత దూరంగా ఉంటుందన్నదే కీలకం.

డిజిటల్‌ గోల్డ్ ధర వచ్చే వారం దారి ఎటు?

భౌతిక బంగారం మాదిరిగానే డిజిటల్‌ గోల్డ్‌ ధరలపైనా అంతర్జాతీయ పసిడి కదలికల ప్రభావం కనిపించింది. అయితే డిజిటల్‌ గోల్డ్‌ ధరను కేవలం స్పాట్‌ గోల్డ్‌ రేటుతో పోల్చడం సరికాదు. ఆయా ప్లాట్‌ఫామ్‌ల కొనుగోలు ధర, విక్రయ ధర, జీఎస్టీ, స్ప్రెడ్‌, ఇతర ఛార్జీలు కూడా తుది ధరలో తేడాకు కారణమవుతాయి.

ఆగస్టు 29న డిజిటల్‌ గోల్డ్‌ ధర గ్రాముకు సుమారు రూ.16,712.65గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల భౌతిక బంగారం గ్రాము ధర రూ.15,824గా ఉంది. అంటే రెండింటి మధ్య సుమారు రూ.889 వ్యత్యాసం కనిపించింది. ఇది పూర్తిగా ధరల పోలికగా మాత్రమే చూడాలి. డిజిటల్‌ గోల్డ్‌ ప్లాట్‌ఫామ్‌ను బట్టి కొనుగోలు, విక్రయ ధరలు మారవచ్చు.
డిజిటల్‌ గోల్డ్‌.. వచ్చే వారం మూడు సీన్లు!

స్పాట్‌ గోల్డ్‌ $4,500 దిగువకు వెళితే..
డిజిటల్‌ గోల్డ్‌పైనా ఒత్తిడి పెరిగి మరింత కరెక్షన్‌ వచ్చే అవకాశం.

$4,500 వద్ద సపోర్ట్‌ లభిస్తే:
ధరలు స్థిరపడే అవకాశం. కొనుగోళ్లు పెరిగితే మళ్లీ పైకి కదలొచ్చు.

అమెరికా ఉద్యోగ డేటా బలహీనంగా వస్తే:
అంతర్జాతీయ బంగారానికి మద్దతు లభించి డిజిటల్‌ గోల్డ్‌లోనూ రికవరీ రావచ్చు.

రూ.16,000 కీలక మానసిక స్థాయి

డిజిటల్‌ గోల్డ్‌ గ్రాము ధరకు రూ.16,000 కీలక మానసిక స్థాయిగా మారే అవకాశం ఉంది. దీని పైన నిలబడితే స్థిరీకరణకు అవకాశం. దిగువకు జారితే మరింత కరెక్షన్‌ వచ్చే అవకాశాన్ని గమనించాలి. అమెరికా ఉద్యోగ డేటా బలంగా ఉంటే బంగారం ధర తగ్గొచ్చు. ఒకవేళ ఉద్యోగ డేటా బలహీనంగా ఉంటే బంగారం ధర పెరగొచ్చు.

మళ్లీ రూ.1.60 లక్షలు దాటుతుందా?

ఇది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అమెరికా ఉద్యోగ గణాంకాలు బలహీనంగా వచ్చి ఫెడ్‌ రేట్ల తగ్గింపుపై అంచనాలు పెరిగితే పసిడి మళ్లీ రూ.1.60 లక్షల స్థాయిని పరీక్షించే అవకాశం ఉంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం అధికంగా కొనసాగి, ఫెడ్‌ కఠిన వైఖరిని కొనసాగిస్తే బంగారంపై మరింత ఒత్తిడి రావచ్చు. ముఖ్యంగా రూ.1.55 లక్షల సపోర్ట్‌ కోల్పోతే కరెక్షన్‌ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

కొనుగోలుదారులకు ఊరట.. కానీ తొందర వద్దు!

ఇటీవల గరిష్ఠాల నుంచి ధరలు తగ్గడంతో బంగారం కొనాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. అయితే వచ్చే వారం కీలక అమెరికా డేటా వెలువడనున్న నేపథ్యంలో ఒక్కసారిగా భారీ మొత్తంలో కొనుగోలు చేయడం కంటే దశలవారీగా కొనుగోలు చేయడం జాగ్రత్తైన విధానంగా భావించవచ్చు.

చివరగా.. పసిడి రూట్‌ ఇదే!

గత వారం పసిడి పరుగులకు బ్రేక్‌ పడింది. ఫెడ్‌ కఠిన వైఖరి, డాలర్‌ బలం, బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల, లాభాల స్వీకరణతో ధరలు గణనీయంగా తగ్గాయి. వచ్చే వారం మాత్రం అమెరికా ఉద్యోగ డేటా చుట్టూనే పసిడి మార్కెట్‌ తిరిగే అవకాశం ఉంది.
రూ.1.55 లక్షల సపోర్ట్‌ నిలిస్తే.. రూ.1.60 లక్షల వైపు రికవరీ!
సపోర్ట్‌ విరిగితే.. మరింత కరెక్షన్‌కు ఛాన్స్‌!

అంటే రాబోయే వారం పసిడికి 'పరుగుల వారమా.. నేలచూపుల వారమా?' అన్నది అమెరికా డేటానే తేల్చనుంది.

ప్రభన్యూస్

ప్రభన్యూస్

1.3M followers243k Stories

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News