Thursday, 16 May, 6.01 pm ప్రభన్యూస్

పతాక శీర్షిక
హైదరాబాద్ : విపక్షాల కలయిక పచ్చి అవకాశవాదం :బండారు దత్తాత్రేయ

నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కాకుండా అడ్డుకోవడానికే యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ మే 23 వ తేదీన యుపిఏ పార్టీలను ( మహాకూటమి ), ప్రతిపక్ష పార్టీలను సమైక్యపర్చి సమావేశం నిర్వహించబోతున్నారని బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో ప్రతిపక్షాల మీద ఘాటు విమర్శలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, కేరళ లో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కలిసి పోటీ చేయని పార్టీలు ఇప్పుడు ఇప్పుడు కలవడం పచ్చి అవకాశవాదమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ఇంకోవైపు కమ్యూనిస్టు పార్టీలు యుపిఏ వైపు ఉండాలో, ఫెడరల్ ఫ్రంట్ వైపు ఉండాలో తేల్చుకోలేక సందిగ్ధం లో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ ప్రధాన మంత్రి అభ్యర్ధి ఎవ్వరైనా పరవాలేదని వ్యాఖ్యానించడంతో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్ధి కాదని అంగీకరించడం సంతోషకరమన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ 80 నుండి 100 సీట్లు సాధించడం గగనమేనని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా, ఆయనది పరిమిత పాత్రేనని, తన స్వంత అస్తిత్వం కోసం పాకులాడుతున్నారు తప్ప ఆయన కింగ్ మేకర్ గా, నిర్ణయాత్మక శక్తిగా ఉండే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఈ నెల 19 వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.

ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ఎందుకు ఇంత హతహలాడుతున్నాయి? అని ప్రశ్నించారు. విశ్లేషణ రాకముందే వారు నిర్దారించుకోవడం ఎలా ఉందంటే 'ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కెసీఆర్ పర్యటనలు వృధా ప్రయాసగానే మిగిలిపోతాయన్నారు.

కెసీఆర్ క్రికెట్ ఆట మొదలవకముందే (తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాలు) రెండు వికెట్లు కోల్పోయారని అన్నారు. నరేంద్ర మోదీకి బిజెపికి, ఎన్డిఏకు ప్రజల్లోఆదరణ పెరిగిందన్నారు. ఈ కూటమి ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించిందన్నారు. బిజెపి స్వంతంగా మెజారిటి సాధిస్తుందని, ఎన్డిఏ మరింత బలోపేతమవుతుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prabha News
Top