Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైడ్రా కృషికి మళ్లీ జీవం

హైడ్రా కృషికి మళ్లీ జీవం

Abhi Naga August 1, 2026Uppal Nallacheruvu is getting colorful with the rains.

హైదరాబాద్‌కు మరో జలవనం..
వర్షాలతో కళకళలాడుతున్న ఉప్పల్ నల్లచెరువు

హైడ్రా పునరుద్ధరణ ఫలితం..
వరద నీటితో నిండిన చెరువు
రూ.20 కోట్లతో సమగ్ర అభివృద్ధి..
జల సంరక్షణతో పాటు వినోద కేంద్రంగా రూపాంతరం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఒకప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు నీటితో కళ తప్పిన ఉప్పల్ నల్లచెరువు ఇప్పుడు వర్షపు నీటితో కళకళలాడుతోంది. హైడ్రా (HYDRAA) చేపట్టిన సమగ్ర పునరుద్ధరణ పనుల ఫలితంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు వరద నీటితో నిండిపోయి మళ్లీ జీవం పోసుకుంది.

హైడ్రా చేపట్టిన పునరుద్ధరణలో భాగంగా వరద నీరు చెరువులోకి చేరేలా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అదే సమయంలో మురుగు నీరు చెరువులోకి రాకుండా ప్రత్యేక బైపాస్ కాలువను నిర్మించింది. దీంతో భారీ వర్షాల సమయంలో వరద నీరు సురక్షితంగా చెరువులోకి చేరుతుండగా, ఎగువ ప్రాంతాల్లో నీటి నిల్వ, ముంపు సమస్యలు గణనీయంగా తగ్గాయి.

ఆక్రమణల తొలగింపుతో విస్తరించిన చెరువు

పునరుద్ధరణలో భాగంగా 10 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించి, చెరువు విస్తీర్ణాన్ని దాదాపు 70 ఎకరాలకు పునరుద్ధరించారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో హైడ్రా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది.

ఇన్‌లెట్లు, ఔట్‌లెట్‌కు ఆధునిక రూపం

చెరువు జలవ్యవస్థను బలోపేతం చేసేందుకు నాచారం చెరువు, పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు చేరేలా రెండు ఇన్‌లెట్లను నిర్మించారు. అలాగే చెరువు పూర్తిగా నిండిన తర్వాత అదనపు నీరు మూసీ నదిలోకి సాఫీగా వెళ్లేలా ఆధునిక ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు.

వినోద కేంద్రంగా తీర్చిదిద్దుతున్న హైడ్రా

జల సంరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వాకింగ్ ట్రాక్, బలమైన ప్రధాన కట్ట, చిన్నారుల ఆట స్థలం, ఓపెన్ జిమ్, పచ్చదనంతో కూడిన వినోద ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారు. కుటుంబాలతో వచ్చి విశ్రాంతి తీసుకునే నగరంలోని ప్రధాన వినోద కేంద్రంగా ఉప్పల్ నల్లచెరువును తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.

హైడ్రా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న ప్రధాన చెరువుల్లో ఉప్పల్ నల్లచెరువు ఒకటి. ఇప్పటికే మూడు చెరువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన హైడ్రా, ఉప్పల్ నల్లచెరువును కూడా త్వరలో హైదరాబాద్‌కు మరో కీలక జలవనరుగా, ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News