Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలి..

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ ఆసిఫాబాద్ ప్రాజెక్టు అధికారి ఎన్.టి.

ప్రకాష్‌రావు కోరారు. మంగళవారం జైనూర్ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టర్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రకాష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించి, పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు.

కాంట్రాక్టర్ గంగన్న మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒప్పందం ప్రకారం వారి ఖాతాల్లో జమ అయిన డబ్బులను సంబంధిత కాంట్రాక్టర్లకు ఇవ్వడం లేదని, దీంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. మరో కాంట్రాక్టర్ సలీం మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద కొండపటార్ కోలం గిరిజనుల కోసం 12 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కావడం లేదని పేర్కొన్నారు.

బిల్లులు మంజూరైతే ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు తెలిపారు. దీనిపై పీడీ ప్రకాష్‌రావు స్పందిస్తూ బిల్లుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్మాణ పనులను మాత్రం నిలిపివేయకుండా కొనసాగించాలని సూచించారు. అవసరమైతే అధికారులతో కలిసి లబ్ధిదారుల వద్దకు వెళ్లి మాట్లాడి, వారికి రావాల్సిన నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

లబ్ధిదారులు సైతం ఇళ్ల నిర్మాణంలో శ్రద్ధ చూపుతూ అధికారులకు, కాంట్రాక్టర్లకు సహకరించాలని కోరారు. ఒప్పందం ప్రకారం తమ ఖాతాల్లో జమ అయిన ఇంటి నిర్మాణ నిధులను సంబంధిత కాంట్రాక్టర్లకు న్యాయపరంగా అందించాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత లోపించకుండా పనులు చేపట్టాలని, బిల్లుల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకాష్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో జైనూర్ ఎంపీడీవో కృష్ణవేణి, హౌసింగ్ శాఖ జైనూర్ ఏఈ సందీప్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News