Pavan Chandragiri July 31, 2026

- సారపాక-రెడ్డిపాలెం రహదారులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
- అవసరమైతే వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం
బూర్గంపాడు, ఆంధ్రప్రభ : గోదావరి నదికి వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని సారపాక, రెడ్డిపాలెం ప్రధాన రహదారులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నీటిమట్టం మరింత పెరిగితే సారపాక-రెడ్డిపాలెం ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలు, ప్రజలు ఆ మార్గంలో ప్రయాణించకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ సూచించారు.

