Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టాలి

నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టాలి

Nagamani Malligari August 1, 2026prabhanews.com

మెడికల్ కాలేజీ సాధనలో ఆయన కృషి మరువలేనిదన్న సీపీఐ నాయకుడు కుమారస్వామి

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు చేయించడంలో, నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు విశేష కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరును నర్సంపేట మెడికల్ కాలేజీకి నామకరణం చేయాలని సీపీఐ వరంగల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

శనివారం నల్లబెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒప్పించి నర్సంపేటకు మెడికల్ కాలేజీ మంజూరు చేయించడమే కాకుండా, నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా తాను నమ్మిన భావజాలం కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని, నర్సంపేట ప్రాంతంలో సీపీఐతో సమన్వయం చేసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర సాధన, నియోజకవర్గ అభివృద్ధికి పెద్ది చేసిన సేవలను ఎవరూ విస్మరించలేరని అన్నారు.

ఆయన మరణం అన్ని రాజకీయ పార్టీలను కలిచివేసిందని, అంతిమయాత్రలో రాజకీయాలకు అతీతంగా వేలాది మంది పాల్గొనడం ఆయనపై ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదే గౌరవంతో నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును త్వరలో కలుస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సీపీఐ జిల్లా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు మామిండ్ల పెద్ద ఐలయ్య, పరికి కోర్నేలు, మనుగొండ ప్రసాద్, కనకం సాల్మన్, ఓదెల రవి, కొనుకటి రమేష్, కాంగ్రెస్ నాయకులు బత్తిని మల్లయ్య, బద్రూ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News