Bharath August 28, 2026prabhanews.com
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- ముంచుకొస్తున్న మరో ముప్పు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: పర్వతాల మధ్య ప్రశాంతంగా కనిపించే నేపాల్ ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది.
ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలు.. కొండచరియలు.. ఎక్కడికక్కడ కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు.. శిథిలాల కింద చిక్కుకున్న జీవితాలు.. తమ వాళ్లు తిరిగి వస్తారేమోనని ఎదురుచూస్తున్న కుటుంబాలు.. ఈ దృశ్యాలు నేపాల్‌లో హృదయ విదారక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.
ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటికే 469 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,468 మంది ఆచూకీ తెలియకుండా పోయారు. వీరిలో 290 మంది భారతీయులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితులు
ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘటనతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. భారీ మంచు, రాళ్ల ప్రవాహం నదిలోకి దూసుకురావడంతో నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది. ఆ అడ్డంకి తెగిపోవడంతో భారీగా నీరు, మట్టి, బండరాళ్లు దిగువ ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. కళ్ల ముందే ఇళ్లు, దుకాణాలు, రహదారులు నీటిలో కలిసిపోయాయి. ఎవరికి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వరద తన వెంట అన్నింటినీ తీసుకెళ్లింది.
కుటుంబ సభ్యుల కోసం అంతులేని ఎదురుచూపులు
ఈ విషాదంలో అత్యంత బాధాకరమైన విషయం గల్లంతైన వారి ఆచూకీ తెలియకపోవడం. ఆస్పత్రుల వద్ద, సహాయక శిబిరాల వద్ద తమ కుటుంబ సభ్యుల కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేస్తే స్పందిస్తారేమో.. ఎక్కడైనా సురక్షితంగా ఉండొచ్చేమో.. అన్న చిన్న ఆశతో కళ్లలో నీళ్లతో ఎదురుచూస్తున్నారు.ఒకవైపు మృతదేహాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతుంటే.. మరోవైపు తమ వాళ్ల జాడ కోసం వందలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
290 మంది భారతీయుల కోసం ఆందోళన
నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిపైనా భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. 290 మంది భారతీయులతో ఇంకా సంబంధాలు ఏర్పడలేదని సమాచారం. ఇప్పటివరకు 84 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. రక్షించిన వారిలో త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది ఉన్నారు. అలాగే కైలాశ్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రసువా ప్రాంతంలో చిక్కుకున్న విదేశీ పర్యాటకులను హెలికాప్టర్ల ద్వారా కాఠ్‌మాండూకు తరలించారు. 27 మంది విదేశీయుల్లో 11 మంది భారతీయులు ఉన్నారు.అటు టిబెట్‌లోనూ సుమారు 200 మంది భారతీయులు చిక్కుకుపోయి సహాయం కోరినట్లు సమాచారం. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయి.
వీరిలో పర్యాటకులు, జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేసేవారు, కైలాశ్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే కొంతమంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఊరటనిచ్చే అంశం. త్రిశూలి ప్రాంతంలోని జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న పలువురితో పాటు ఇతర భారతీయులను కూడా రక్షించారు. కానీ ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన మాత్రం కొనసాగుతోంది.
రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో పెరిగిన కష్టాలు..
వరదల ధాటికి రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. రోడ్లు తెగిపోవడంతో మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. అనేక వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక బృందాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కొన్ని ప్రాంతాల్లో బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో అక్కడ చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడమే కష్టంగా మారింది.హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నా.. ప్రతికూల పరిస్థితులు ఆపరేషన్‌ను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి.
చుట్టుముడుతున్న మరో ప్రమాదం..
ఇంతటి విషాదం నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే మరో భయం వెంటాడుతోంది. వరదల కారణంగా కొండ ప్రాంతంలో భారీగా నీరు చేరి సహజమైన బ్యారియర్ సరస్సు ఏర్పడింది. అందులో నీటి మట్టం మరింత పెరిగితే సహజ అడ్డంకి తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదే జరిగితే మరోసారి భారీగా వరద నీరు దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉంది.అందుకే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారత్ నుంచి సహాయక చర్యలు
నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల ఆచూకీ తెలుసుకునేందుకు భారత అధికారులు నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు.అదే సమయంలో బాధితులకు అవసరమైన అత్యవసర సామగ్రి, మందులు, ఆహారం, ఇతర సహాయ వస్తువులను కూడా భారత్ పంపిస్తోంది.
విషాదంలోనూ ఆ ఒక్క ఆశ..
'ఎక్కడున్నారు?' అని ఎదురు చూస్తున్న కుటుంబాలకు.. 'సురక్షితంగా ఉన్నారు' అనే ఒక్క మాట ఎప్పుడు వినిపిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.నేపాల్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా విధ్వంసం కనిపిస్తోంది. కొండలు కూలాయి.. నదులు ఉప్పొంగాయి.. రహదారులు మాయమయ్యాయి.. ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి.
