Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nepal flash floods | నేపాల్‌ వరదల విషాదం.. భారత్‌కు కొట్టుకొచ్చిన ముగ్గురి మృతదేహాలు

Bharath August 28, 2026prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావం భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలపైనా కనిపిస్తోంది.

నేపాల్‌ నుంచి గండక్‌ నదిలో కొట్టుకొచ్చినట్లు అనుమానిస్తున్న ముగ్గురి మృతదేహాలను ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ జిల్లాలో అధికారులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.నదిలో నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్న సశస్త్ర సీమా బల్‌ (SSB) సిబ్బంది ఈ మృతదేహాలను గుర్తించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోతుండగా వాటిని గమనించిన సిబ్బంది.. వెంటనే మోటార్‌ బోటు సాయంతో బయటకు తీసుకొచ్చారు.

అనంతరం మృతదేహాలను మహారాజ్‌గంజ్‌ జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు. అయితే ఇప్పటివరకు మృతుల పేర్లు, ఇతర వివరాలు తెలియరాలేదు. వారి గుర్తింపును నిర్ధారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

నేపాల్‌ అధికారులతో సంప్రదింపులు..

మృతదేహాల గుర్తింపుతో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు SSB, జిల్లా అధికారులు నేపాల్‌లోని సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ముగ్గురూ నేపాల్‌కు చెందినవారేనా? లేక వరదల్లో గల్లంతైన ఇతర ప్రాంతాలకు చెందినవారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు నేపాల్‌ నుంచి గండక్‌ నదిలో కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న ముగ్గురి మృతదేహాలను భారత భూభాగంలో గుర్తించినట్లు SSB ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ పాండే తెలిపారు.

మరిన్ని మృతదేహాలు కొట్టుకొచ్చే అవకాశం..

నేపాల్‌లో భారీ వరదల కారణంగా గండక్‌ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని మృతదేహాలు భారత భూభాగంలోకి కొట్టుకొచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో SSB బృందాలు గండక్‌ నది పరివాహక ప్రాంతంలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. నదిలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్పందించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.

తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక

ఇదిలా ఉండగా.. స్థానిక అధికారులు గండక్‌ నది నీటిమట్టం, ప్రవాహ వేగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేపాల్‌లో వరదల ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు.. గండక్‌ నదిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News