Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nepal Flash Floods |తీర్థయాత్రకు 36 మంది.. తిరిగొచ్చింది ఆరుగురే.. గుండెల్ని పిండేసే వరద విషాదం

Bharath August 31, 2026prabhanews.com

దైవ దర్శనం చేసుకుని.. కుటుంబాలతో ఆనందంగా తిరిగి వస్తామని చెప్పి బయలుదేరిన 36 మంది భక్తులు. కానీ వారి ప్రయాణం గమ్యస్థానానికి చేరకముందే ఓ భయానక వరద వారి జీవితాలను తారుమారు చేసింది.

క్షణాల్లో ఉప్పొంగిన భోటేకోశి నది.. కళ్ల ముందే బస్సును తనలోకి లాగేసుకుంది. ఆ సమయంలో ప్రాణాల కోసం కొందరు బస్సు నుంచి దూకి బయటపడినా.. వారి భార్యలు, బంధువులు మాత్రం అదే బస్సులో చిక్కుకుపోయారు. ఐదు రోజులు గడిచినా ఆ బస్సు జాడ లేదు.. తమవారి ఆచూకీ లేదు. ప్రాణాలతో బయటపడిన వారి కళ్లలో ఇప్పుడు ఆనందం లేదు.. "మేము బతికాం.. కానీ మా వాళ్లు ఎక్కడ?" అన్న ప్రశ్న మాత్రమే మిగిలింది.

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ప్రయాణం.. కాసేపట్లోనే ఊహించని విషాదంగా మారింది. జనై పూర్ణిమ ( రాఖీ పౌర్ణమి) సందర్బంగా గోసైంకుండకు భక్తితో బయలుదేరిన 36 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు నువాకోట్‌లోని భైన్సే ప్రాంతంలో భోటేకోశి నది ఉప్పొంగడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడిచినా బస్సు ఆచూకీ దొరకకపోవడం బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళనను పెంచుతోంది.అధికారులు ఇప్పటివరకు రెండు మృతదేహాలను గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులు మాత్రం కదులుతున్న బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మరో 28 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

తీర్థయాత్రకు బయలుదేరిన ఆనందం.. గంటల్లోనే విషాదం

గోర్ఖాలోని పలుంగ్తార్ చెందిన మజ్తార్ గ్రామస్తులు జానై పూర్ణిమ సందర్భంగా గోసైంకుండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం తెల్లవారు జామున 36 మంది భక్తులు చార్టర్డ్ బస్సులో ప్రయాణం ప్రారంభించారు. తీర్థయాత్రకు వెళ్తున్నామన్న ఆనందంతో బయలుదేరిన వారి కుటుంబాలు.. కొన్ని గంటల్లోనే భయానక వార్త వినాల్సి వచ్చింది. బస్సు నువాకోట్‌లోని భైన్సే ప్రాంతానికి చేరుకున్న సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భోటేకోశి నది నుంచి ఉధృతంగా వచ్చిన వరద ప్రవాహం బస్సును తనలోకి లాగేసుకుంది.

ఈ ప్రమాదం నుంచి బయటపడిన బద్రి ప్రసాద్ దేవకోట చెప్పిన విషయాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. డ్రైవర్‌కు సమీపంలో కూర్చున్న ఆయనకు మొదట రోడ్డుపై నీరు కనిపించింది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని గ్రహించేలోపే భారీ వరద ప్రవాహం వాహనం వైపు దూసుకొచ్చింది. "నల్లటి నీటి ప్రవాహం ఆకాశమంతా కమ్ముకుంటున్నట్లు కనిపించింది. ఇక బతకాలంటే బస్సు నుంచి దూకడం తప్ప మరో మార్గం లేదనిపించింది" అని బద్రి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన భార్య సంఝానా ఆయన చేతిని గట్టిగా పట్టుకుని.. "దూకవద్దు" అంటూ వేడుకున్నారు. కానీ పరిస్థితి అంతకంతకూ విషమించడంతో బద్రి ప్రసాద్ ఆమె చేతిని విడిపించుకుని బస్సు నుంచి బయటకు దూకారు. ఆయనకు తెలియదు.. అదే తన భార్యను చివరిసారిగా చూసే క్షణమని.

బస్సు మునిగిపోయింది.. మళ్లీ కనిపించలేదు

బస్సు నుంచి బయటకు దూకిన వెంటనే బద్రి ప్రసాద్‌ను వరద ప్రవాహం రోడ్డుపక్కన ఉన్న కాలువ వైపు విసిరేసింది. కొద్దిసేపటికే మరో భారీ అల అతన్ని తాకింది. అదే సమయంలో తన బంధువు తులారామ్ దేవకోట కొండపై ఉన్న ఓ పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చూశారు. ఇద్దరూ ఎలాగోలా పొదలను పట్టుకుని పైకి చేరుకున్నారు. వెనక్కి తిరిగి చూసేసరికి వారి కళ్ల ముందున్న దృశ్యం భయానకంగా మారింది. బస్సు పూర్తిగా వరదలో మునిగిపోయింది.

బయటకు దూకినందుకు పశ్చాత్తాపపడుతున్నా - బద్రి ప్రసాద్

"నా భార్య ఆ బస్సులోనే ఉంది. నా పొరుగువాళ్లు కూడా అందులోనే ఉన్నారు. బయటకు దూకినందుకు వెంటనే పశ్చాత్తాపంగా అనిపించింది. నా కుటుంబం పోయిందనిపించింది. నేను ఎంత గట్టిగా అరిచినా నా అరుపులు వినేవారు ఎవరూ లేరు" అని ఆయన కన్నీటితో గుర్తుచేసుకున్నారు.

వరద ఉధృతి నుంచి తప్పించుకున్న బద్రి ప్రసాద్, తులారామ్ సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు కొండపైకి ఎక్కారు. అక్కడ ఓ చిన్న పచ్చిక ప్రదేశంలో రెండు గంటలపాటు గడిపారు. కొంతమంది ఇళ్ల పైకప్పులపై చిక్కుకుని సహాయం కోసం కేకలు వేస్తున్నారు. మరికొందరి చేతులు మాత్రమే బురదలోంచి కనిపిస్తున్నాయి. వారిని రక్షించేందుకు వెంటనే ఎవరూ చేరుకోలేని పరిస్థితి. కొంతసేపటికి హెలికాప్టర్ కనిపించినా, అప్పటికే ప్రాణాలతో బయటపడిన ఇద్దరూ అక్కడి నుంచి మరింత ఎత్తైన ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది.

తెలియని ఊర్లో స్థానికులే అండగా నిలిచారు

చివరకు హిలేఖర్క ప్రాంతానికి చేరుకున్న వారికి అక్కడి స్థానికులు మానవత్వంతో అండగా నిలిచారు. టీ, బిస్కెట్లు అందించి, ప్రాథమిక చికిత్స కోసం సూర్యగఢి గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతానికి తరలించారు. అయితే వారి మనసులో మాత్రం ఒకే ఆలోచన.

"మా వాళ్లు ఎక్కడ?"

మరుసటి రోజే కుటుంబ సభ్యుల కోసం వెతకడానికి వారు మళ్లీ భైన్సే ప్రాంతానికి వెళ్లారు. కానీ ఎలాంటి సమాచారం లభించలేదు. చివరకు తీవ్ర నిరాశతో శుక్రవారం తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు.

"వాళ్లను సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని నమ్మారు"

తులారామ్ దేవకోట బాధ కూడా మాటల్లో చెప్పలేనిది. ఆయన భార్య తేజ్ కుమారి కూడా బస్సులోనే ఉన్నారు. "మేము తీర్థయాత్రకు వెళ్తున్నామని చెప్పినప్పుడు ఇరుగుపొరుగు వారు తమ భార్యలను, కుమార్తెలను, కోడళ్లను మాతో పంపించారు. మేము వారిని సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని అందరూ నమ్మారు. ఇప్పుడు వారిని తిరిగి తీసుకురాలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతోంది" అని తులారామ్ కన్నీటితో చెప్పారు. విపత్తు జరిగిన ప్రాంతానికి తులారామ్ రెండుసార్లు వెళ్లారు. ఎంత వెతికినా తన భార్య జాడ మాత్రం కనిపించలేదు.

ముందస్తు హెచ్చరిక ఉంటే..?

ఈ ప్రమాదం పూర్తిగా ఊహించలేనిదేమీ కాదని తులారామ్ అభిప్రాయపడ్డారు. ఎగువ ప్రాంతాల్లో వరద పరిస్థితి ఏర్పడిన వెంటనే దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు చేరి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఆయన అన్నారు. "వరద నీరు రోడ్డును చేరుకునే వరకు మాకు ప్రమాదం గురించి తెలియలేదు. ముందుగానే సమాచారం అందితే వాహనాన్ని ఆపగలిగేవాళ్లం. త్రిశూలి నది పరివాహక ప్రాంతంలో మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే ఇంతటి ప్రాణనష్టం తప్పేదేమో" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో మిగిలింది నిశ్శబ్దమే

ఈ విషాదం పలుంగ్తార్ ప్రాంతంలోని కుటుంబాలను తీవ్రంగా కుదిపేసింది. ఒకే కుటుంబానికి చెందిన వారు కనిపించకుండా పోవడంతో అనేక ఇళ్లలో కన్నీరు ఆగడం లేదు. కొన్ని ఇళ్లలో తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తున్న పిల్లలు ఉన్నారు. మరికొన్ని ఇళ్ల తలుపులు తెరిచేందుకు కూడా కుటుంబ సభ్యులు మిగలలేదు. నౌఖోర్ ప్రాంతంలో సాధారణంగా వినిపించే గ్రామీణ సందడి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రతి శబ్దానికీ తమవారి ఆచూకీ దొరికిందేమోనని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

తీర్థయాత్ర కోసం బయలుదేరిన 36 మంది జీవితాలను ఒక్కసారిగా మార్చేసిన ఈ వరద.. ఎన్నో కుటుంబాల్లో మాత్రం ఎప్పటికీ చెరిగిపోని విషాదాన్ని మిగిల్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News