Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nepal Flash Floods | వరద ముంచుకొస్తోందని హెచ్చరిక.. క్షణాల్లో స్కూల్ ఖాళీ చేయించిన ప్రిన్సిపాల్

Bharath August 30, 2026prabhanews.com

కాఠ్మాండు, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం మధ్య ఓ పాఠశాల ప్రిన్సిపాల్ చూపించిన అప్రమత్తత వందలాది మంది చిన్నారుల ప్రాణాలను కాపాడింది.

త్రిశూలి లోయలో భారీగా వరద నీరు, బురద, రాళ్లు, మంచు, శిథిలాలు దూసుకొస్తున్న సమయంలో.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థులను పాఠశాల నుంచి బయటకు తరలించారు. దీంతో ఏకంగా 1,643 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

నువాకోట్ జిల్లాలోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడికి బుధవారం ఉదయం 9.20 గంటలకు ఓ స్నేహితుడి నుంచి సమాచారం అందింది. దగ్గరలోని గ్రామం వైపు భారీ వరద దూసుకొస్తోందని, పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని అతడు హెచ్చరించాడు.

కొన్ని నిమిషాల్లోనే నిర్ణయం…

ఆ సమయంలో పాఠశాలలో, పరిసర ప్రాంతాల్లో కలిపి 1,643 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల భవనం కాంక్రీట్‌తో నిర్మించబడి ఉండటంతో పాటు నదికి సుమారు 60 మీటర్ల ఎత్తులో ఉండటంతో తొలుత దవాడికి పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని అనిపించింది. అయితే వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో పరిస్థితిని అంచనా వేసిన ఆయన వెంటనే చర్యలకు దిగారు. పాఠశాల గంట మోగించి తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను బయటకు తీసుకురావాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

అనంతరం పాఠశాల బస్సు డ్రైవర్లకు ఫోన్ చేసి బస్సులను వెనక్కి మళ్లించాలని సూచించారు. అదే సమయంలో ఓ బస్సు ప్రమాదకర పరిస్థితుల్లో వంతెన దాటుతున్న దృశ్యం ఆయన కళ్లముందే కనిపించింది. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు.

భయంతో పరుగులు తీసిన విద్యార్థులు..

వరద ముప్పు తమకు దగ్గరగా వచ్చిందని తెలుసుకున్న విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఓ విద్యార్థిని తీవ్ర భయంతో వణికిపోవడంతో ఆమెను మోటార్‌బైక్‌పై కొండ ప్రాంతం వైపు తరలించారు. మిగిలిన విద్యార్థులు ఉపాధ్యాయుల వెంట కాలినడకన సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు. కొద్ది సేపటికే వరద ప్రవాహం పాఠశాల పరిసరాలను ముంచెత్తింది. భారీగా వచ్చిన బురద, రాళ్లు, మంచు, శిథిలాల ప్రవాహం పాఠశాల భవనాలతో పాటు పరిసర ప్రాంతాలను ధ్వంసం చేసింది. చివరకు విద్యార్థులు ఓ చెట్టు కింద తాత్కాలికంగా ఆశ్రయం పొందారు.

ఇద్దరు పాఠశాల సిబ్బంది మృతి..

విద్యార్థులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినప్పటికీ.. పాఠశాల సిబ్బందిలో ఇద్దరు మాత్రం ఈ విపత్తు నుంచి బయటపడలేకపోయారు. ఉపాధ్యాయుడు సంతోస్ పరియార్ (32) నది సమీపంలోని తన అద్దె గదికి వెళ్లిన సమయంలో వరదలో కొట్టుకుపోయారు. మరోవైపు పాఠశాల తలుపులు మూసేందుకు వెళ్లిన పారిశుధ్య కార్మికుడు సుల్తాన్ లామా కూడా వరద ప్రవాహానికి బలయ్యారు.

'హీరో' అంటున్న స్థానికులు..

1,643 మంది విద్యార్థులను కాపాడిన దవాడిని స్థానికులు హీరోగా అభివర్ణిస్తున్నారు. అయితే ఆయన మాత్రం తన నిర్ణయాన్ని పెద్ద విషయంగా భావించడం లేదు. ఒకప్పుడు విద్యార్థులతో సందడిగా ఉన్న పాఠశాల ప్రాంతం ఇప్పుడు బురద, రాళ్లు, శిథిలాల కుప్పగా మారడాన్ని చూస్తూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "గ్రామం మొత్తం నాశనమైపోయింది. నది దాటికి కొట్టుకుపోయింది. నన్ను పరుగెత్తమని చెప్పారు" అని దవాడి చెప్పినట్లు కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఆకస్మిక వరద కారణంగా నేపాల్‌లో భారీ ప్రాణ నష్టం సంభవించింది. బురద, రాళ్లు, మంచు, శిథిలాల ప్రవాహంలో అనేక గ్రామాలు, భవనాలు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో 734 మంది మరణించగా, సుమారు 2,498 మంది గల్లంతైనట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. టిబెట్‌లోనూ 16 మంది మరణించగా.. గిరాంగ్ కౌంటీలో మరో 546 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే ఈ విషాద ఘటనలో 1,643 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో రాజేంద్ర దవాడి తీసుకున్న నిర్ణయం మాత్రం ఓ ఆశాకిరణంగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News