Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Nepal Flash Floods | వరద ఉధృతికి కూడా కదలని ఇల్లు.. అసలు కారణం ఇదే!

Bharath September 1, 2026prabhanews.com

క్కవైపు ఉగ్రరూపం దాల్చిన వరద.. మరోవైపు దాని మధ్యలో చెక్కుచెదరకుండా నిలిచిన ఓ ఇల్లు. చుట్టుపక్కల వాహనాలు, భవనాలు, సామగ్రి మొత్తం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినా..

ఆ ఆకుపచ్చ రంగు ఇల్లు మాత్రం అలాగే నిలిచింది. నేపాల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ ఇంటిని చూసిన ప్రతి ఒక్కరూ 'ఇది ఎలా సాధ్యమైంది?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: నేపాల్‌లోని నువాకోట్‌ జిల్లాలో త్రిశూలి నది ఉప్పొంగడంతో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. నది నీరు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు, వాహనాలు, దుకాణాలు, తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే నదికి సమీపంలో ఉన్న సుమారు 40 ఏళ్ల నాటి ఆకుపచ్చ రంగు ఇల్లు మాత్రం ఈ వరద బీభత్సాన్ని తట్టుకుని నిలిచింది. వరద ప్రవాహం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన దృశ్యాల్లో ఈ ఇల్లు ప్రత్యేకంగా కనిపించడంతో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

చూసే వారికి ఆశ్చర్యంగా అనిపించిన ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇదే విషయాన్ని ఆ ఇంటి యజమాని ప్రకాష్‌ తన కుటుంబంతో కలిసి వరదలో చిక్కుకున్న భయానక పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అసలు ఇంత వరదలో కూడా ఆ ఇల్లు ఎలా నిలించిదో అని విషయాలను పంచుకున్నారు.

వరద నీరు వేగంగా పెరుగుతోందని సమాచారం రావడంతో నేను వెంటనే నా దుకాణం నుంచి ఇంటికి పరిగెత్తుకొచ్చాను. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ అప్రమత్తం చేసి త్వరగా పైకి వెళ్లమని చెప్పాను. బయటకు వచ్చి చూసేసరికి వరద ఉధృతికి నా వాహనం బోల్తా పడిపోయింది. అది చూసిన వెంటనే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమై.. మళ్లీ ఇంట్లోకి పరిగెత్తాను. ముందుగా మేమంతా ఇంట్లోని నాలుగో అంతస్తుకు వెళ్లాం. కానీ నీటి మట్టం అంతకంతకూ పెరుగుతూ చివరకు నాలుగో అంతస్తు వరకు కూడా వచ్చేసింది. దాంతో అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్లి ఇంటి పైకప్పు ప్రాంతంలో తలదాచుకున్నాం. కింద చూస్తే భారీగా వరద ప్రవహిస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

ఆ సమయంలో నా ఆలోచనలన్నీ నా కుటుంబం గురించే. మా ఇంట్లో ఆరుగురం ఉన్నాం. నా కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు నాతోనే ఉన్నారు. కానీ నా కొడుకుల్లో ఒకడు ఆ సమయంలో ఇంట్లో లేడు. అతను పాఠశాలకు వెళ్లాడు. మాకేదైనా జరిగితే.. వాడి పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచిస్తూనే ఉన్నాను.

"బహుశా ఇది నా జీవితంలో చివరి క్షణం కావచ్చు.. మా జీవితాలు ముగిసిపోతున్నాయని అనిపించింది. మాకు ఏదైనా జరిగితే నా కొడుకు ఏమవుతాడనే ఆలోచనే నా మనసులో పదేపదే మెదులుతూనే ఉంది" అని ఇంటి యజమాని ప్రకాష్‌ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు.

40 ఏళ్ల నాటి ఇల్లు.. అంత బలంగా ఎలా నిలిచింది?

చుట్టుపక్కల నిర్మాణాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయినా ఈ ఇల్లు మాత్రం నిలిచి ఉండటానికి కారణం దాని నిర్మాణమేనని ప్రకాష్‌ తెలిపారు. ఈ ఇల్లు సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించామని, అప్పట్లో ఉపయోగించిన సిమెంట్‌, ఇతర నిర్మాణ సామగ్రి నాణ్యత చాలా మెరుగ్గా ఉండేదని పేర్కొన్నారు. అంతేకాకుండా నదికి సమీపంలో ఇల్లు నిర్మించడంతో పునాది విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. ఇంటి పునాది కింద రెండు మూడు పొరల నిర్మాణ సామగ్రిని వేసి మరింత బలంగా నిర్మించామని వివరించారు. అయితే ఇల్లు వరద దాటి నుంచి పూర్తిగా తప్పించుకోలేదు. కింది భాగంలో ఉన్న దుకాణం, సరుకులు నిల్వ ఉంచే గది వరద నీటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.

తాడు సాయంతో సాహసోపేత రక్షణ..

వరద ఉధృతి తగ్గే వరకు ప్రకాష్‌ కుటుంబం సుమారు గంట నుంచి గంటన్నర పాటు ఇంటి పైభాగంలోనే చిక్కుకుపోయింది. చివరకు సమీపంలోని టోల్‌ ప్లాజా ప్రాంతానికి చెందిన కొందరు వారిని కాపాడటానికి వచ్చారు. భవనాల మధ్య ఒక పైపును ఏర్పాటు చేసి, దానికి తాడు సహాయంతో వరదను దాటుకుంటూ బయటపడ్డారు.

ఇప్పుడు ఈ 'అద్భుత ఇల్లు' ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాల్లో ఒకటిగా నిలిచింది. చుట్టూ ఉన్న దాదాపు ప్రతిదీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయినా.. నాలుగు దశాబ్దాలుగా నిలిచిన ఆ ఇల్లు మాత్రం తలెత్తుకుని నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News