Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్దన్నకు జోహార్..!

పెద్దన్నకు జోహార్..!

Pavan Chandragiri August 1, 2026

  • ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి..
  • రాజకీయాల్లో పదవులు కాదు… ప్రజల ప్రేమే శాశ్వతమని చాటిన నేత

నర్సంపేట, ఆంధ్రప్రభ : రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పదవులు వస్తుంటాయి… పోతుంటాయి. కానీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడం మాత్రం కొద్దిమంది నాయకులకే సాధ్యమవుతుంది. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి జీవితం అలాంటి అరుదైన ప్రజానాయకుడి జీవితానికి నిదర్శనం.

తెలంగాణ ఉద్యమ జ్వాలలు రగులుతున్న రోజుల్లో ఉద్యమ స్ఫూర్తిని గ్రామాగ్రామానికి తీసుకెళ్లిన నాయకుల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒకరు. ఉద్యమం కోసం అహర్నిశలు శ్రమించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఆవేదనలో ఉన్న కుటుంబాలను ఓదార్చుతూ, ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా మార్చడంలో తనవంతు పాత్ర పోషించారు.

ఆచార్య జయశంకర్ ఆలోచనలకు ప్రభావితులై, తెలంగాణ ఉద్యమ శిల్పి కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ గల ఉద్యమ సైనికుడిగా ఎదిగారు. "పెద్దసారు చెబుతారు… పెద్ది చేసి చూపిస్తాడు" అనే పేరు సంపాదించుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… గులాబీ జెండా గౌరవాన్ని చివరి వరకు నిలబెట్టారు.

ఎమ్మెల్యేగా ఐదేళ్లు మాత్రమే పనిచేసినా, ప్రజా సేవను మాత్రం జీవితాంతం కొనసాగించారు. సాదాసీదా జీవనం, అద్దె ఇంట్లో నివాసం, ఆడంబరాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. ప్రజలకు అవసరం వచ్చినప్పుడు సమయం చూడకుండా అండగా నిలబడే నాయకుడిగా గుర్తింపు పొందారు.

అందుకే ఆయన మరణవార్త తెలిసిన క్షణం నుంచి నర్సంపేట ప్రజలు తట్టుకోలేకపోయారు. గ్రామాలు, తండాలు, పట్టణాల నుంచి లక్షలాది మంది అభిమానులు అంతిమయాత్రకు తరలివచ్చారు. కన్నీటి వీడ్కోలు పలుకుతూ, "పెద్దన్న" అంటూ గుండెలవిసేలా విలపించారు. అంతిమయాత్రలో కనిపించిన జనసంద్రం ఒక రాజకీయ నాయకుడికి కాదు… ప్రజల కుటుంబ సభ్యుడికి ఇచ్చిన వీడ్కోలు అనే భావనను కలిగించింది.

నర్సంపేట ప్రజలు తమ పెద్దకొడుకును కోల్పోయినట్లు రోదించారు. రాజకీయ భేదాలు, పార్టీ గీతలు అన్నీ పక్కనపెట్టి అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదికపై చేరి నివాళులర్పించడం ఆయన సంపాదించిన ప్రజాభిమానానికి నిదర్శనం.

ఈ దృశ్యం నేటి రాజకీయ నాయకులకు గొప్ప సందేశాన్ని ఇస్తోంది. పదవులు, అధికారాలు, ప్రచారాలు శాశ్వతం కావు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలబడే మనసు, మాట నిలబెట్టుకునే నమ్మకం, సేవాభావం మాత్రమే నాయకుడిని చిరస్థాయిగా నిలబెడతాయి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన నాయకుడికి మరణం కూడా ముగింపు కాదు… అది ప్రజల జ్ఞాపకాలలో కొత్త ఆరంభం.

పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికంగా దూరమైనా… ఆయన ప్రజాసేవ, ఉద్యమస్ఫూర్తి, నిబద్ధత, సరళ జీవనం నర్సంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

జోహార్ పెద్దన్న…మీ సేవలకు ప్రజల నివాళి శాశ్వతం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News