Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి

Nagamani Malligari August 1, 2026prabhanews.com

కలెక్టర్ కోయ శ్రీహర్ష

వీబీజీ-రామ్ పథకం పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రతి ఇంటికి, చేతి పంపులు, బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే లక్ష్యంతో వీబీజీ-రామ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీబీజీ-రామ్ పథకం అమలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వీబీజీ-రామ్ పథకం కింద అవసరమైన పరిపాలనా అనుమతులను వెంటనే మంజూరు చేసి, ఆగస్టు నెలలోనే పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎంపీడీఓలు గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తాగునీటి వనరులు కలుషితం కాకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించారు. తాగునీటి పైప్‌లైన్లను క్రమం తప్పకుండా పరిశీలించి, అవసరమైన చోట్ల శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు.

వర్షాకాలంలో ప్రజలకు కలుషిత రహిత తాగునీరు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. క్లోరినేషన్ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో నిరంతరం నిర్వహించి, నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందేలా చూడాలని సూచించారు.

అన్ని ఓవర్‌హెడ్ నీటి ట్యాంకులను నిర్దిష్ట వ్యవధిలో శుభ్రపరచాలని, నీటి నిల్వ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో తాగునీటి కలుషితం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తూ అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రామపంచాయతీలు, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News