Rama Rao September 1, 2026Telangana
కోదాడ అర్బన్, ఆంధ్రప్రభ: కోదాడ పట్టణ సీఐ శివశంకర్‌పై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రజలను, అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తూ, బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిన పోలీస్ స్టేషన్‌ను సెటిల్మెంట్లకు వేదికగా మార్చడం ఏమిటని ప్రశ్నించారు. సీఐ శివశంకర్ సస్పెండ్ అయ్యే వరకు తమ పోరాటాలు ఆగవని, ప్రజలకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా ప్రజలందరినీ.. సమానంగా చూడాలని, పేదలు, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి అండగా నిలవాల్సిన బాధ్యతను విస్మరించకూడదన్నారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పేదవాడికి న్యాయం అందాలని, లంచాలకు తావులేకుండా చట్టం ముందు అందరూ సమానమే అనే విధంగా పోలీసింగ్ జరగాలని మల్లయ్య యాదవ్ అన్నారు. గంజాయి వంటి కేసుల్లో కోదాడ అడ్డాగా మారుతోందని ఆరోపిస్తూ, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని, అధికార దుర్వినియోగానికి అంతం పలకాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఐ శివశంకర్‌పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు, బాధితులు, బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల కూడా సీఐ తీరుపై చర్యలు తీసుకోవాలని మల్లయ్య యాదవ్ డిమాండ్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
