Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Telangana BJP | తెలంగాణ బీజేపీలో కేడర్‌ను.. ముందుండి నడిపించే నాయకుడెవరు?

Bharath August 27, 2026prabhanews.com

  • నియోజకవర్గ స్థాయిలో బలపడిన నాయకత్వానికి పార్టీ నుంచి ప్రోత్సాహం కరవు
  • వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సై అంటున్నా..
  • కనిపించని వెన్నుతట్టే నేతలు
  • ఎవరికి వారు పదవులు కాపాడుకునే ప్రయత్నాలు.. రాష్ట్ర పార్టీలో అయోమయ సంకేతాలు
  • ఇంటలిజెన్స్‌ వర్గాల ద్వారా లోపాలు, వైఫల్యాలను గుర్తించిన అధినాయకత్వం
  • అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ యుద్ధ వాతావరణంలో బీజేపీకి సానుకూలం
  • అయినా, పరిస్థితులను ఎందుకు అందిపుచ్చుకోలేక పోతున్నారన్న ప్రశ్నలు సందిస్తున్న కేడర్‌
  • త్వరలోనే సంస్థాగత ప్రక్షాళన దిశగా చర్యలకు కసరత్తు.. పదవుల్లో కీలక మార్పులు
  • సంఘ్‌ పరివార్‌ హెచ్చరిస్తున్నా పట్టించుకోని బీజేపీ నేతలు
  • సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్‌లో మార్పులు జరగవచ్చని ప్రచారం
  • కిషన్‌ రెడ్డికి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు దక్కే అవకాశం
  • వయోదిత మంత్రులను తప్పించే యోచనలో కాషాయ పార్టీ అధిష్టానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : తెలంగాణాలో పాగా వేయాలన్న భారతీయ జనతా పార్టీ ఆకాంక్షకు నాయకత్వ లేమి శాపంగా మారుతోంది. ఒకప్పుడు అవకాశాలు ఆమడ దూరంలో కూడా కనిపించక, ఇప్పుడు అనుకూలత పుష్కలంగా ఉండి కూడా ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, మరోవైపు జాతీయ పార్టీ అధినాయకత్వం 'తామున్నాం.. ముందడుగు వేయండి' అని బలమైన సపోర్టును అందిస్తున్నా.. అందిపుచ్చుకోలేని రాజకీయ వ్యవస్థ ఆ పార్టీలో కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నెలకొన్న సామాజిక పరిస్థితులు, పరిణామాలు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ప్రతికూలతను స్పష్టం చేస్తున్నా.. తెలంగాణ బీజేపీలో కేడర్‌ను ముందుండి నడిపించే నాయకుడెవరన్న ప్రశ్న ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. తాము సైతం అంటూ.. జిల్లా పార్టీ నాయకత్వాలు సవాళ్లు విసురుతుంటే, పోటీకి సిద్ధమంటూ నియోజకవర్గ స్థాయిలో ఆశావహ అభ్యర్థులు వనరులను సంసిద్ధం చేసుకుంటుంటే.. బలపడుతున్న సంస్థాగత నాయకత్వానికి పార్టీ నుంచి ప్రోత్సాహం కరవైపోతోందన్న ఆందోళన క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనేక మంది ఆర్థిక సుస్థిరత కలిగిన నేతలు పోటీకి సై అంటున్నా.. వెన్నుతట్టి ప్రోత్సహించే నేతలు కనిపించని వైనం, దయనీయం వెంటాడుతోంది. ఎవరికి వారు పదవులు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర పార్టీలో అయోమయ స్థితిని, ప్రతికూల సంకేతాలను పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తమ ఇంటలిజెన్స్‌ వర్గాల ద్వారా లోపాలు, వైఫల్యాలను గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం ఎంతటి తాపత్రయంతో ఉందో.. అంతే స్థాయిలో రాష్ట్ర నాయకత్వంలో అలసత్వం కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ యుద్ధ వాతావరణంలో బీజేపీకి సానుకూలత పెరుగుతూ వస్తోందని రాజకీయ విశ్లేషకుల తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. అయినా, పరిస్థితులను ఎందుకు అందిపుచ్చుకోలేక పోతున్నారని కేడర్‌ ప్రశ్నలు సందిస్తోంది.

త్వరలోనే సంస్థాగత ప్రక్షాళన..

కేంద్ర వర్గాల సమాచారం మేరకు త్వరలోనే సంస్థాగత ప్రక్షాళన దిశగా చర్యలకు కసరత్తు.. పదవుల్లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. సంఘ్‌ పరివార్‌ హెచ్చరిస్తున్నా పట్టించుకోని బీజేపీ నేతలపై క్రమశిక్షణా చర్యలతో పాటు పార్టీ పదవుల నుంచి దింపే ప్రక్రియ ప్రారంభమవుతుందన్న సంకేతాలు వినవస్తున్నాయి. అదే సమయంలో సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్‌లో మార్పులు జరగవచ్చని ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. కిషన్‌ రెడ్డికి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు- దక్కే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు చెబుతున్నారు. వయోదిత మంత్రులను తప్పించే యోచనలో కాశాయ పార్టీ అధిష్టానం అంతర్గత కసరత్తు ముమ్మరం చేసింది.

గత కొద్ది నెలల కాలంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్గత విభేదాలు, పరిపాలనాపరమైన ఇబ్బందులతో ప్రజల్లో కొంత అసంతృప్తి మొదలవుతోంది. ఇటు బీఆర్‌ఎస్‌ ప్రాభవం కోల్పోతుండటం, అటు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో.. కమలం పార్టీకి స్పష్టమైన పొలిటికల్‌ స్పేస్‌ లభించింది. కానీ, ఈ సువర్ణ అవకాశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో తెలంగాణ బీజేపీ తీవ్రంగా తడబడుతోంది. తెలంగాణలో రాజకీయ శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఓ మంచి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. కానీ బీజేపీ ఎందుకు క్యాష్‌ చేసుకోలేకపోతోంది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం కీలక పదవులు అనుభవిస్తున్న నేతలెవకూ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. అదే తెలంగాణ బీజేపీకి ఉన్న ప్రధాన లోపమన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. పాలనకు తాము సిద్ధమనే సవాల్‌ చేసే స్థాయి, ముఖ్యమంత్రి పదవిని చేపట్టే స్తోమత కలిగిన స్పష్టమైన తిరుగులేని ఒకరిద్దరు బలమైన నేతలు లేకపోవడంతో నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

ఎవరికి వారే యమునా తీరే..

గతంలో బండి సంజయ్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అగ్రెసివ్‌ హిందూత్వ, నిరసనలతో కేడర్‌లో పీక్‌ లెవెల్‌ జోష్‌ ఉండేది. ఆ తర్వాత గంగాపురం కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, ధర్మపురి అరవింద్‌ వంటి అగ్రనేతలు ఉన్నప్పటికీ.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయనే భావన ప్రజల్లోకి వెళ్తోంది. నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల అధికార కాంగ్రెస్‌పై లేదా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఒక్కటిగా దాడి చేయలేకపోతున్నారు. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భాల్లో మాత్రమే బెంగాల్‌ తరహా పోరాట వ్యూహంతో ముందడుగు వేస్తామన్న సవాల్‌ కనిపిస్తోంది. ఆ తర్వాత యధాతద పరీస్థితితో పార్టీ ఎలాంటి వ్యూహం లేకుండానే కాలం గడుపుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని దీదీ కోటను బద్దలు కొట్టడానికి బీజేపీ ఎలాగైతే అగ్రెసివ్‌ కేడర్‌ పాలిటిక్స్‌ చేసిందో, తెలంగాణలోనూ అలాంటి బెంగాల్‌ తరహా పోరాట వ్యూహం అవసరమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. ఒకప్పుడు బీజేపీకి కార్యకర్త కూడా కనిపించన పశ్చిమ బెంగాల్‌లో కమలం పార్టీ ప్రతీ పంచాయతీ, ప్రతీ వార్డు స్థాయి వరకు వెళ్లి కేడర్‌ను నిర్మించి, అధికార పార్టీ దాష్టీకాలను ధైర్యంగా ఎదుర్కొంది. కానీ తెలంగాణలో ప్రెస్‌ మీట్లు, కరపత్రాల పంపిణీ, ఢిల్లీ పర్యటనలకే పరిమితమవుతున్నారు తప్ప.. ప్రజల తరఫున సుదీర్ఘకాలం పాటు రోడ్డెక్కి పోరాడే పాదయాత్రలు, ధర్నాలు కరవయ్యాయి.

బీజేపీ పై సామాన్య ప్రజల్లో ఉన్న మరో అనుమానం కూడా వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటేనా? అనే పాత ప్రచారం. ఈ నెగెటివ్‌ ఇంప్రెషన్‌ను పూర్తిస్థాయిలో తుడిచిపెట్టేలా బీజేపీ గ్రౌండ్‌ లెవెల్‌లో నమ్మకాన్ని కలిగించలేకపోయింది. తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కాలంటే తక్షణమే కొన్ని విప్లవాత్మక మార్పులు అవసరమని అభిమానుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. పార్టీలోని గ్రూపు తత్వాలకు స్వస్తి చెప్పి, ఒక సమర్థవంతమైన, మాస్‌ ఇమేజ్‌ ఉన్న నాయకుడిని ముందు పెట్టి నడిపించాలి. ప్రజల నిత్య జీవిత సమస్యలైన రుణమాఫీ, ఉపాధి, రైతు భరోసా, మౌలిక వసతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్లీ కోలుకోవడం తెలంగాణ బీజేపీకి సాధ్యం కాకపోవచ్చునన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. "గతంలో కేసీఆర్‌ పదేళ్ల పాలన చూశారు, ప్రస్తుతం కాంగ్రెస్‌ మార్క్‌ పాలననూ చూస్తున్నారు.. ఒక్కసారి కమలానికి అవకాశం ఇవ్వండి" అనే బలమైన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమవుతోంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటినప్పటికీ, ఆ ఉత్సాహాన్ని రాష్ట్ర స్థాయి అధికారం దిశగా మళ్లించే సమిష్టి వ్యూహం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కేవలం ఢిల్లీ పెద్దల ఇమేజ్‌, మోడీ చరిష్మాపైనే ఆధారపడటం తప్ప.. స్థానిక నాయకత్వం ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని నింపలేకపోతోంది. కేవలం ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపడం మాత్రమే సరిపోదు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే ప్రణాళికను దాన్ని నడిపించే ఒక ఫేస్‌ ను చూపిస్తేనే ప్రజలు జాతీయ పార్టీలకు ప్రాంతీయ స్థాయిలో ఓటేస్తారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత, సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు జరగవచ్చని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు-, పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూర్పు వంటి అంశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధాని మోడీ సెప్టెంబర్‌ 1న ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ల పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే అధికార యంత్రాంగంలో మార్పులు మొదలవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఉత్కంఠ.. ఎవరికి ఏ పదవి?

ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి గవర్నర్‌ పదవి లభించవచ్చని గట్టిగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి పార్టీ పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో 69 మంది మంత్రులు ఉండగా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మరో 12 మందిని నియమించుకునేందుకు అవకాశం ఉంది. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, 70 ఏళ్లు పైబడిన 12 మంది మంత్రులను పదవుల నుంచి తప్పించి, వారి స్థానంలో యువ నాయకులకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, కిరణ్‌కుమార్‌రెడ్డి నియామకంపై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. గతంలోనూ ఆయన పేరుపై ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు. మొత్తం మీద, పార్టీలో అంతర్గత మార్పుల అనంతరం సెప్టెంబర్‌లో పునర్వ్యవస్థీకరణ ఖాయమని భావిస్తున్నప్పటికీ, ఎవరికి ఏ పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

నరేంద్ర మోడీ ప్రస్తుత కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులకు గవర్నర్లుగా అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ నుంచి బీజేపీ నేత.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి గవర్నర్‌ పదవి ఖాయమైందని సమాచారం. అదే విధంగా ఏపీ నుంచి టీడీపీ, జనసేన ఎంపీల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. జనసేనకు అవకాశం వస్తే వల్లభనేని బాలశౌరీ, టీడీపీ నుంచి ఛాన్స్‌ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఇక.. తెలంగాణలో కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌కు పార్లమెంటరీ పార్టీ బోర్డులో అవకాశం దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా డీకే అరుణ, నగేష్‌, ఈటల రాజేందర్‌ లో ఇద్దరికి కొత్తగా మంత్రులుగా అవకాశం ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో.. వచ్చేనెల తొలి వారంలో కేంద్రంలో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News