Bharath August 27, 2026prabhanews.com
- గడిచిన రెండు నెలల కాలంగా కాంగ్రెస్‌ను వెంటాడుతున్న వర్గ విభేదాలు
- వరుస ఘటనలు.. ఏఐసీసీ పెద్దల వద్దకు ఇరు వర్గాల రసహ్య నివేదికలు
- అనుకూల, ప్రతికూల వర్గాల నివేదికల పరిశీలన, నివేదికల భేరీజు
- పార్టీలో తేడాలు తెచ్చింది పదవుల పందేరమేనంటున్న సీనియర్లు
- అధిష్టానం నిర్ణయం కోసం వేచిచూస్తున్న నేతలు, అనుచర వర్గం
- పార్టీని వీడబోమన్న కొండా మురళి వ్యాఖ్యలు వ్యూహాత్మకమే
- ఇటు నుంచి చర్యలకు సిఫారసు… అటు నుంచి మరో వర్గం అడ్డుకట్ట
- మరోవైపు రాజీ కోసమే ఈ రాయభారమంటూ టీపీసీసీ వర్గాల వెల్లడి
- ఇప్పట్లో ఏ ఒక్కరిపైనా చర్యలు ఉండబోవన్న సంకేతాలిస్తున్న తాజా పరిణామాలు
- పంతాలు, పట్టింపులకు పోయి వ్యవస్థకు, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం రోజుకో కోణంలో మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారం సంస్థాగతంగా పార్టీకి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నప్పటికీ, అదుపు చేసే క్రమంలో అన్నీ వైఫల్యాలే కనిపిస్తున్నాయి. పైకి కనిపించే రాజకీయం ఒకరకంగా, లోలోపల మరోరకంగా ఉంటుండడంతో ఈ విషయంలో అధిష్టానం సైతం గందరగోళంలోనే ఉంది. క్షేత్రస్థాయి కార్యకర్త వరకూ పార్టీ యంత్రాంగమంతా కష్టపడి అధికారంలోకి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయం కొంతమంది సీనియర్లలో బలంగా కనిపిస్తున్నప్పటికీ, జిల్లాస్థాయి రాజకీయాల్లో అది ఎక్కడా కనిపించడం లేదు. కొన్నిచోట్ల ఇంఛార్జి మంత్రుల వ్యవహారం, మరికొన్ని చోట్ల పదవులు, టిక్కెట్లు ఆశించి భంగపడిన వ్యవహారం.. ఇలా కొన్ని జిల్లాల్లో పరిస్థితులు పార్టీ పట్ల ప్రతికూలతను పెంచేస్తున్నాయి. ఈ విషయం ఆయా ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు తెలిసినప్పటికీ పంతాలు, పట్టింపులకు పోయి వ్యవస్థకు, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగిస్తున్నారు.
ఇటు కొండా దంపతులు.. అటు కోమటిరెడ్డి బ్రదర్స్.. మధ్యలో భంగపాటు నేతలు.. అంతా ఏకమై ఎవరికి వారు స్వలబ్ధి కోసం రాజకీయాలు చేస్తుండడంతో ఆ ప్రభావం ప్రభుత్వంపై తీవ్రస్థాయికి పెరుగుతూ వస్తోంది. ఓ వైపు ఉత్తర తెలంగాణాలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్ నేతలు, మరోవైపు దక్షిణ తెలంగాణాలోని నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలు వర్గ విభేదాల కుంపటి రాజేయడంపై సర్వతం చర్చ జరుగుతోంది. అది ఇప్పట్లో సమసిపోయే అవకాశం కనిపించక పోగా, అధికార కాంగ్రెస్‌లో తాజాగా తెరపైకి వచ్చిన ప్లాన్-బి పై ఉత్కంఠ మొదలైంది. మొదట కొండా దంపతుల ప్లాన్-బి రాజకీయాల్లో హైకమాండ్ నిర్ణయం వరకూ అంతా సైలెంట్‌గా జరుగుతోంది. భవిష్యత్తులో ఆ నేతలు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికర పరిణామాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వంలోనూ, సొంత శాఖలోనూ తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం పూర్తిస్థాయి మౌనం పాటిస్తున్నారు.
బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన వైఖరిని, ఎదురవుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు- వివరించి వచ్చిన తర్వాత ఆమె వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇకపై మీడియాతో మాట్లాడేది లేదని తెగేసి చెప్పడం, క్రమశిక్షణా కమిటీ అధిష్టానానికి నివేదిక సమర్పించిన తర్వాత కూడా ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. గడిచిన రెండు నెలల కాలంగా కాంగ్రెస్‌ను వర్గ విభేదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏఐసీసీ పెద్దల వద్దకు ఇరు వర్గాల రసహ్య నివేదికలు వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయాల జోలికి పోకుండా అనుకూల, ప్రతికూల వర్గాల నివేదికల పరిశీలన, నివేదికలను పరిశీలించి వాస్తవాలను భేరీజు వేసిన తర్వాతే అధిష్టానం చర్యలకు ఉపక్రమిస్తుందన్న చర్చ జరుగుతోంది. అవకాశాల కోసం కాచుకు కూర్చున్న విపక్షాల చేతికి వైఫల్యాలను ఆయుధంగా ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా తేడాలు తెచ్చింది, విభేదాలు సృష్టించింది పదవుల పందేరమేనంటునంటూ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన మూడు రోజుల పరిణామాలను పరిశీలిస్తే, ఆయా నేతలు, అనుచర వర్గం అంతా అధిష్టానం నిర్ణయం కోసం వేచిచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీని వీడబోమన్న కొండా మురళి వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనంటూ అదే జిల్లాలకు చెందిన కొందరు నేతలు అనుమానిస్తున్నారు. ఇటు నుంచి ఓ వర్గం చర్యలకు సిఫారసు చేస్తుంటే, అటు నుంచి మరో వర్గం అడ్డుకట్ట వేస్తుండడం.. మరోవైపు రాజీ కోసమే ఈ రాయభారమంటూ టీపీసీసీ వర్గాల వెల్లడిస్తుండడం అంతా అయోమయ స్థితిని స్పష్టం చేస్తోంది. ఇప్పట్లో ఏ ఒక్కరిపైనా చర్యలు ఉండబోవని తాజా పరిణామాలు సంకేతాలిస్తున్నాయి.
కొండ సురేఖ సైలెన్స్..
వరంగల్ జిల్లా రాజకీయాల్లో తలపండిన మంత్రి కొండా సురేఖ కుటుంబం ఆ ధీమాతోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన శాఖలోని అధికారులను తనకు తెలీకుండానే మాతృశాఖలకు పంపడం, ఓఎస్డీ సెటిల్మెంట్ల వ్యవహారంలో చట్టపరమైన విచారణలు వేగవంతం కావడం వంటి అంశాలపై సురేఖ తన అసంతృప్తిని ఇప్పటికే హైకమాండ్ ముందు ఉంచారు. అధిష్టానానికి పరిస్థితిని వివరించిన తర్వాత, తన బాధ్యత ముగిసిందన్నట్లుగా ఓ రోజు సెక్రటేరియట్లో విధులు నిర్వహించిన ఆమె.. ఇప్పుడు వెయిట్ అండ్ సీ ధోరణిని అవలంబిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? తనను కేబినెట్ నుంచి తప్పిస్తుందా లేక నష్ట నివారణ చర్యలు చేపడుతుందా అనే అంశం ఆధారంగానే సురేఖ దంపతులు తమ తదుపరి అడుగులు వేయనున్నారు. కొండా సురేఖ ప్రస్తుత సైలెన్స్ కేవలం నిశ్శబ్దం కాదు, అధిష్టానం నిర్ణయం ఆధారంగా రాజకీయ దారి మార్చుకోవడానికి వేస్తున్న ముందస్తు ప్రణాళికగా అనుకోవచ్చు. ఒకవేళ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలకే మొగ్గు చూపి, ఆమెతో బలవంతంగా మంత్రి పదవికి రాజీనామా చేయిస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గత చరిత్రను పరిశీలిస్తే కొండా సురేఖ దంపతులు ఏ పార్టీలో ఉన్నా తమ స్వయంప్రతిపత్తిని, ఆత్మగౌరవాన్ని వదులుకునేందుకు సిద్ధపడలేదు. కేవలం మంత్రి పదవి ఊడిపోవడమే కాకుండా పార్టీలో ప్రాధాన్యత తగ్గితే.. ఆమె కేవలం కాంగ్రెస్లోనే ఉండిపోతారా లేక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తమ సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పులో సవాలు విసురుతారా అనేది కీలక ప్రశ్నగా మారుతోంది. మంత్రి పదవిని కోల్పోతే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బై-ఎలక్షన్‌కు వెళ్లే సాహసం కొండా మురళి, సురేఖ దంపతులు చేయవచ్చనే టాక్ వరంగల్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది.
తమకున్న బలమైన బీసీ కేడర్, వ్యక్తిగత ఇమేజ్ను నమ్ముకుని ఉపఎన్నికకు వెళ్లడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి రాజకీయ సవాలు విసిరే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తమపై కఠిన చర్యలు తీసుకుంటే, బిసి సెంటిమెంటు-్న క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ ఉపఎన్నిక మార్గాన్ని ఎంచుకోవచ్చు. తెలంగాణలో బలపడేందుకు చూస్తున్న భారతీయ జనతా పార్టీ.. ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాల దృష్ట్యా బలమైన బీసీ నాయకత్వం కోసం వెతుకుతోంది. కొండా సురేఖ దంపతులకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ నుంచి వైదొలిగితే బీజేపీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ అభ్యర్థిగా సార్వత్రిక లేదా ఉపఎన్నికల బరిలోకి దిగడం సురేఖ దంపతులకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. కొండా సురేఖ మౌనం అనేది తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. అధిష్టానం ఇచ్చే ఫైనల్ రిపోర్టు లేదా తీసుకునే నిర్ణయమే తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రాజకీయ ఆధిపత్య రగడకు దారితీస్తుందా లేదా అనేది తేల్చనుంది.
కొండా దంపతుల తదుపరి అడుగు కాంగ్రెస్ పార్టీకి వరంగల్ రీజియన్‌లో మునుపటి కంటే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపాన్ని అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. వరుసగా తలెత్తుతున్న వివాదాలతో పీసీసీ మార్పు తప్పదా? అన్న స్థాయికి కూడా పరిణామాలు జఠిలమవుతున్నాయి. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి.
వరుస వివాదాలతో కాంగ్రెస్‌లో కలవరం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాలనపై, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ.. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బలమైన నాథుడు కరువవడంతో గాంధీభవన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. భిన్న ధృవాలుగా ఉండే సీనియర్ నేతలను, విభిన్న వర్గాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త లేకపోవడం వల్లే పార్టీలో ఈ అంతర్గత సంక్షౌభం ముదురుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు నియామక ప్రక్రియ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఈ బోర్డు నియామకంలో తమకు సరైన ప్రాధాన్యత దక్కలేదని, జూనియర్లకు పదవులు కట్టబెట్టారని పార్టీ కోసం ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో తమకు తెలియకుండానే నియామకాలు జరగడంపై వారు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఈ వివాదం సద్దుమణగక ముందే, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యవహారం పార్టీని మరింత రక్షణలో పడేసింది. ఒక కీలకమైన బీసీ నేతను ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. సామాజిక సమీకరణాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన తెలంగాణ వంటి రాష్ట్రంలో, బలమైన బీసీ వర్గానికి చెందిన నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ సాంప్రదాయానికి విరుద్ధమని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, అంతర్గత కుల సమీకరణాల ఘర్షణకు దారితీస్తోంది.
