Sowjanya Anneboina September 23, 2026prabhanews.com
చిట్యాల,ఆంధ్రప్రభ : వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో ప్రథమ చికిత్స సదుపాయాలతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.
చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, వాహనాలు, బ్యారికేడింగ్, పారిశుద్ధ్య సిబ్బంది, గజ ఈతగాళ్లు, బోట్లు, ప్రథమ చికిత్స కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రథమ చికిత్స కేంద్రంలో అందుబాటులో ఉంచిన మందులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమజ్జనం సందర్భంగా అనుకోని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే ప్రథమ చికిత్స అందించేందుకు బ్యాండేజీలు, అయోడిన్‌తో పాటు అవసరమైన ఇతర మందులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత పత్రి, పూలు, ఇతర వ్యర్థాలను చెరువులో వేయకుండా డస్ట్‌బిన్‌లలో వేయించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను సేకరించి అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ విజయ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
