- ఐదు అసెంబ్లీ ఎన్నికల
- ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. సోమవారం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.
కేరళం, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆయా రాష్ట్రాల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దీంతో ఎన్నికల ఫలితాలపై సర్వ త్రా ఉత్కంఠ నెలకుంది.
నేటి మధ్యాహ్నంలోగానే ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పశ్చిమబెంగాల్ మినహా మిగిలిన అన్ని చోట్ల ఒకే దశలో ఎన్నికలను నిర్వహించారు. బెంగాల్లో మాత్రం రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో అనేక చోట్ల శనివారం రీపోలింగ్ నిర్వహించారు.
ఇక ఫల్తా నియోజకవర్గం యావత్తు రీపోలింగ్ కు ఇసి అసాధారణ ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇక్కడ ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించనున్నారు. 24న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ పై ఇసి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాయి.
భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ జాబితాలో ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్, మాల్దా, నాడియా, బీర్‌భూం, పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ వంటి జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, ఫలితాలు వెలువడే సమయంలో అల్లర్లు జరగకుండా ఉండేందుకు అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. 75వేల మంది కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించిగా, బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకోగల అధునాతన 'మార్క్స్‌మ్యాన్' సాయుధ వాహనాలను రంగంలోకి దించారు.

