ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో చాలో చోట్ల లాక్‌డౌన్లు, ఆంక్షలతో ఉపాధి కోల్పోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ యోజన కింద ఒక్కొక్కరికి అయిదు కిలోల చొప్పున ఆహారధాన్యాలను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రెండు మాసాలవరకే ఈ తిండిగింజల పంపిణీ సౌకర్యం ఉంటుందని, తరువాత పరిస్థితిని బట్టి దీని పొడిగించాలా లేదా అనే అంశాన్ని ఆహార, ప్రజా పంపిణీ శాఖ నిర్ణయిస్తుందని తెలిపింది.
పిఎం-కేర్స్ నిధులతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్ ఆసుపత్రుల్లో రెండు హై ఫ్లో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఐడిబిఐ బ్యాంకులో పెట్టుబడుల ఉపసంహరణ :
కరోనాతో దేశం పోరాడుతున్న సమయంలో ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, నిర్వహణ నియంత్రణ బదిలీ సత్వరమే పూర్తి చేయాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఐడిబిఐ బ్యాంక్‌లో కేంద్రం 45.48శాతం, ఎల్‌ఐసి 49.24శాతం వాటా ఉన్నాయి. ఎల్‌ఐసి ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంక్ మేనేజిమెంట్ కంట్రోల్ ప్రమోటర్‌గాను, కేంద్ర ప్రభుత్వం కో- ప్రమోటర్‌గాను ఉన్నాయి.

