తూర్పు గోదావరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ స్టేట్ మెంబర్‌గా ప్రతాప్

సఖినేటిపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ స్టేట్ మెంబర్‌గా జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ నియమితులయ్యారు. టూరిజం అండ్ కల్చరల్ ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌మీనా నుంచి సమాచారం అందుకున్నట్టు ఆయన తెలిపారు. సాహిత్య విస్తరణ, తెలుగు సాహిత్యం, పుస్తకాలు, ఇతర సాహిత్య అంశాలపై ఈ అకాడమీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. అమరావతి కేంద్రంగా అకాడమీ చైర్మన్ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ సారథ్యంలో అకాడమీ పనిచేస్తుందన్నారు. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గతంలో ప్రతిష్టాత్మకమైన గుర్రం జాషువా అవార్డును, ఉగాది పురస్కారాన్ని, కాసుల పురుషోత్తం కవి పురస్కారాన్ని అందుకున్నారు.
అలాగే రోటరీ క్లబ్ నుంచి సాహితీ రత్న, కవి భూషణ్ అవార్డులు పొందారు. మ్యాప్స్ నుంచి సాహిత్య భూషణ్ అవార్డును , యునెస్కో క్లబ్ నుంచి జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. కవిగా ఆరు కవితా సంకలనాలు విడుదల చేశారు. ఇటీవల ప్రతాప్ రాసిన గల్ఫ్ వలసలో జీవితాలు పుస్తకాన్ని కువైట్‌లో సినీ నటి గౌతమీ, హైదరాబాద్ లో మాజీ గవర్నర్ రోశయ్య ఆవిష్కరించారు .
డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అంతర్వేదిలో తొలిసారిగా 30 గంటల 30 నిముషాల 30 సెకన్ల పాటు ఏకధాటిగా తెలుగు ప్రపంచ కవితోత్సవాన్ని నిర్వహించి పలు రికార్డులు సాధించారు. వందలాది కవి సమ్మేళనాలను నిర్వహించారు. రాష్ట్ర సాహిత్య అకాడెమీ మెంబర్‌గా కత్తిమండ ఎంపిక కావడం పట్ల రాజోలు ఎంఎల్ఎ గొల్లపల్లి సూర్యారావు, జానపద అకాడెమీ చైర్మన్ పొట్లూరి హరికృష్ణ, గోదావరి దినపత్రిక సంపాదకులు బోళ్ల సతీష్‌బాబు, తెలుగు యువత జిల్లా కార్యవర్గ కార్యదర్శి బోళ్ల వెంకట రమణ తదితరులు అభినందించారు.