ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ఐసిఎఆర్-సిఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం రీసెర్చ్ సెంటర్ ఫిన్ ఫిష్‌ల నర్సరీ పెంపకం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన రీ సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ (ఆర్ఎఎస్)ను ఐసిఎఆర్-సిఎంఎఫ్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎ.గోపాలకృష్ణన్ సోమవారం దేశానికి అంకితం చేశారు.
దేశంలోనే సముద్రతీర పరిశోధనలో ఇదొక కీలక పురోగతి అని, పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు. అనంతరం సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన రైతుల శిక్షణ హాస్టల్ 'ఇండియన్ పాంపనో'ను ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు అవగాహనా ఒప్పందాలు జరిగాయి. ఎంఎస్ఆర్ ఆక్వా ప్రయివేట్ లిమిటెడ్‌తో భారతీయ పాంపనో కోసం బ్రూడ్‌స్టాక్ డెవలప్మెంట్, సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ కోసం, రేవతి బండారుతో భారత పాంపనో సముద్రపు పంజర పెంపకంపై సాంకేతిక సేవల కోసం, లయ స్వచ్ఛంద సంస్థతో సముద్రపు పాచి సాగులో సాంకేతిక సేవల కోసం ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఆర్సి డాక్టర్ జె.చార్లెస్ జీవా, డాక్టర్ శుభదీప్ ఘోష్ పాల్గొన్నారు.

