Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తులన్నీ అమ్మేసి.. సినిమా తీశా!

ఆస్తులన్నీ అమ్మేసి.. సినిమా తీశా!

'మహామహులే తీయలేకపోతున్నారు. ఆఫ్ట్రాల్‌ వీడెంత? అసలు సినిమా తీయగలడా?, తీసినా విడుదల చేయగలడా?, అసలు తీసేంత డబ్బుందా?'.. ఇలా ఎన్నో మాటలు చైతన్యకు ఎదురయ్యాయి.

'డాక్టరు వృత్తి చేసుకోక, వీడికెందుకు సినిమాల గోల!' అన్న వారు లేకపోలేదు. ఇలాంటి ఎన్నో అనుమానాలు, విమర్శలు చేసినా.. చైతన్య ముందుకే సాగారు. 'షాట్‌ కెమెరా..యాక్షన్‌' అంటూ మెగా ఆఫర్‌ అందుకున్నారు చైతన్య మోటూరి. షార్ట్‌ ఫిలిమ్స్‌ నుంచి వెండితెరపై సినిమా తీసే స్థాయికి ఎదిగారు. కాకినాడ యాసలో 'గేదెల రాజు' సినిమా తీసి.. అటు గోదావరి ప్రజలనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్ర సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య మోటూరి గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

'నాది డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఉప్పలగుప్తం. ఫిజియోథెరపీ కోర్సు చేశా. కోనసీమ ప్రాంతంలోనే విద్యాభ్యాసాన్ని పూర్తిచేశాను. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టం. స్క్రిప్టులు కూడా సొంతంగా తయారుచేసేవాడిని. ప్రముఖ హీరోల డైలాగులు ఇమిటేట్‌ చేసేవాడిని. నా చిన్నప్పుడు నాటిక, నాటక ప్రదర్శనలు జరిగేటప్పుడు తెగ చూసేవాడిని. అలాగే శ్రద్ధ పెట్టి చదువుకునేవాడిని. అందుకే మా అమ్మనాన్నలు సినిమాల విషయంలో నన్ను ప్రోత్సహించారు.

వీడియోల ద్వారా వైద్యసేవలు
కాకినాడలో ఫిజియోథెరపీ కోర్సు పూర్తిచేశాను. స్వంతంగా హాస్పటల్‌ నిర్వహిస్తూ, రోగులకు శారీరక నొప్పులు, గాయాలు, కీళ్ల సమస్యలు తగ్గించేలా వ్యాయామాలు, చికిత్సలు అందిస్తూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సేవలు అందిస్తున్నాను. ప్రమాదాలు, శస్త్రచికిత్సల తర్వాత త్వరగా కోలుకునేలా మార్గదర్శనం చేసి, రోజువారీ పనులు సులభంగా చేయగలిగేలా సహాయం చేస్తున్నాను. ప్రజలు, రోగుల ఆరోగ్యం మెరుగుదల కోసం వైద్యసేవలను వీడియోలు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టేవాడిని. ఆరోగ్యపరమైనవి కావటంతో జనాల్లోకి బాగా వెళ్లేవి. ఆయా వీడియోలు బాగా ట్రెండింగ్‌లో ఉండేవి.

సామాజిక అంశాలు- షార్ట్‌ ఫిలిమ్స్‌
పదేళ్ల క్రితం షార్ట్‌ఫిలిమ్స్‌ తీసే ఔత్సాహిక యువతతో పరిచయం ఏర్పడింది. కాకినాడ షార్ట్‌ ఫిలిం క్లబ్‌లో చేరాను. సామాజిక అంశాలపై దృష్టి పెట్టి, లఘుచ్రితాలను తీశాం. వాటికి ప్రేక్షకాదరణ లభించింది. ఇలా చేస్తున్న క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా నన్ను సంప్రదించి, కొన్ని ఆరోగ్యపరమైన అంశాలు, ప్రభుత్వ పథకాల గురించి షార్ట్‌ ఫిలిమ్స్‌ తీయటానికి కూడా అవకాశాలు కల్పించింది. సామాజిక సమస్యలపై.. విద్యారంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మంచి సందేశాత్మకంగా 'బొమ్మల బడులు' డాక్యుమెంటరీని రూపొందించాము. బాగా పాపులర్‌ అయ్యింది. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీలు, సంక్షేమ పథకాలు పొందే విధానాలపై రూపొందించిన వీడియోలు చక్కగా వచ్చాయి. కాకినాడలో ప్రభుత్వ రంగరాయ మెడికల్‌ కళాశాల సౌజన్యంతో రూపొందించిన 10 లఘుచిత్రాలు సందేశాత్మకంగా సాగాయి. అనేక పురస్కారాలు, అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి. బైక్‌ అంబులెన్స్‌పైనా అవగాహన కల్పించాం. సముద్ర, నదీ, అటవీ ప్రాంతాల్లో బైక్‌ అంబులెన్స్ ఉన్న విషయం చాలామందికి తెలియదు. ఆపద కాలంలో ఆదుకునే ఇలాంటి అంబులెన్స్‌ల గురించి అవగాహన కల్పిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది.

గేదెల రాజు సినిమా కోసం…
'డియర్‌ కామ్రేడ్‌' సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ రంగంవైపు వచ్చాను. అప్పుడే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆర్థికంగా అంత స్థోమత లేదు. నా ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆస్తులను అమ్మేసి, డబ్బు ఇచ్చారు. ఈ సినిమాకు సినీ గాయకుడు రఘు కుంచే మంచి అసెట్‌. ఆయనే టైటిల్‌ రోల్‌ పోషించారు. గేదెల రాజు లాంటి రౌడీషీటర్‌ హత్య చుట్టూ ఇరుక్కుపోయిన ఐదు విభిన్నమైన జీవితాల చుట్టూ జరిగే కథగా తెరకెక్కించాను. ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక.. ''చూసింది రెండు గంటల సినిమానా లేక నూరేళ్ల జీవితమా'' అనేలా సినిమా ఉందని చెప్పారు. ఇందులో మహిళా పోలీస్‌ అధికారిగా నా సతీమణి కీలకమైన రోల్‌లో చేశారు. ఏప్రిల్‌ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నాకు సంతోషంగా ఉంది.'

పేరు: చైతన్య మోటూరి

తల్లిదండ్రులు: వాణి, రవికుమార్‌.

భార్య : దివ్య

సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti