Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయొద్దు

అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయొద్దు

  • సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం

ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం) : అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయొద్దని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కొత్తపల్లి లోకనాథం ప్రభుత్వాన్ని కోరారు.

విశాఖపట్నం పరిధి ఆరిలోవ సమీపంలోని ముడసర్లో రిజర్వాయర్ ఎదురుగా ఉన్న కొండపై అదాని గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించిన భూములను బుధవారం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, జివిఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ బి గంగారావు బృందంతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణ కోసం ఆందోళన వ్యక్తం చేస్తుంటే, రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని ఫణంగా పెట్టి నగరం నడిబొడ్డున 'గూగుల్ అదాని డేటా సెంటర్' ఏర్పాటుకు సిద్ధపడడం పచ్చి దుర్మార్గమని పేర్కొన్నారు. దేవస్థానం భూములను పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా 160 ఎకరాలను అదాని సంస్థకు కేటాయింపు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. దీంతో పాటు జివిఎంసికి చెందిన 13 ఎకరాల భూమిని కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు.

డేటా సెంటర్ ఏర్పాటు చేయబోయే ప్రాంతానికి సమీపంలోనే ముడసర్లోవ పార్క్, రిజర్వాయర్ ఉన్నాయని, ఈ ప్రాజెక్ట్ వల్ల క్యాచ్ మెంట్ ఏరియా పూర్తిగా దెబ్బతిని నీటి లభ్యత తగ్గిపోతుందని తెలిపారు. ఒక్క ఆరిలోవ ప్రాంతంలో లక్ష కుటుంబాలకు ముడసర్లోవ రిజర్వాయర్ నుండే నీరు అందుతోందని గుర్తుచేశారు. ఈ డేటా సెంటర్ వస్తే లక్ష కుటుంబాలకు నీటి సరఫరా సంగతేమిటని ప్రశ్నించారు. మరోవైపు జీవరాశులకు, ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కైలాసగిరి, జూ పార్క్, కంబాలకొండ లాంటి పర్యావరణ, పర్యాటక ప్రాంతాల్లోని వన్యప్రాణులు ఈ ప్రాజెక్ట్ వల్ల తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. తక్షణమే డేటా సెంటర్ కేటాయించిన అనుమతులు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti