Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐక్య పోరాటాలతోనే దోపిడి నుంచి విముక్తి

ఐక్య పోరాటాలతోనే దోపిడి నుంచి విముక్తి

పెట్టుబడిదారీ దోపిడీ సమాజాన్ని కూల్చి, దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించడంలో ఆధునిక కార్మికవర్గ పాత్ర గురించి కారల్‌ మార్క్స్‌ తన రచనలన్నింటిలో చాలా స్పష్టంగా విశదీకరించారు.

మే 5న కారల్‌ మార్క్స్‌ 208వ జయంతి. ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గ నాయకత్వంలో జరుగుతున్నది. ప్రస్తుతం పెట్టుబడిదారీ సమాజం పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయి, ఎప్పుడు, ఎలా బయటపడుతుందో అర్థంకాక పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్థకులు తలలు పట్టుకొని కూర్చున్నారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలను అధిగమించాలంటే 150 ఏళ్ల క్రితం కారల్‌ మార్క్స్‌ ఏం పరిష్కారాలు చెప్పారోనని…ఆయన రచించిన గ్రంథాలను ఆధునిక ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారీ సమాజ సమర్థకులు కూడా అధ్యయనం చేయాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది. అదీ మార్క్స్‌ గొప్పతనం.1866లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్‌లో "ట్రేడ్‌ యూనియన్ల భూత, భవిష్యత్తు వర్తమానాలు" అనే తీర్మానాన్ని కారల్‌ మార్క్స్‌ రూపొందించి ప్రవేశపెట్టారు. దాని ఆధారంగా ట్రేడ్‌ యూనియన్ల ప్రాధాన్యత గురించి ఏం చెప్పారో పరిశీలిద్దాం.
ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలలో ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ ప్రారంభ దినాలను ఆయన అనుసరించారు. ఆ ఉద్యమంలో బలమైన, బలహీనమైన అంశాలను పరిశీలించిన మీదట ట్రేడ్‌ యూనియన్‌ల ప్రాముఖ్యతను, కార్యాచరణలో వాటికున్న హద్దులను, ఆర్థిక, రాజకీయ సమస్యల పట్ల వాటికున్న సంబంధ బాంధవ్యాలను తన గ్రంథాలలో నిర్వచించారు.
ట్రేడ్‌ యూనియన్లు కార్మిక శక్తులను సమీకరించి ప్రాథమిక వర్గశిక్షణను ఇచ్చే కేంద్రాలుగా మార్క్సు మొదట పరిగణించారు. కార్మికులు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ చెల్లాచెదురైన వారు ఒక కేంద్రానికి చేరుకోగానే ఐక్య కార్యాచరణకు పూనుకోవడం ఆయన గమనించారు. ఇందులోనే కార్మిక వర్గం ఒక స్వతంత్ర శక్తిగా అభివృద్ధి కాగలదని ఆయన గ్రహించారు.
పెట్టుబడి అనేది కేంద్రీకృత సాంఘిక శక్తి. అయితే కార్మికునికి ఉన్నది వ్యక్తిగత శ్రమ శక్తి మాత్రమే. శ్రమకు, పెట్టుబడికి మధ్య న్యాయ సమ్మతమైన ఒడంబడిక ఎన్నటికీ కుదరదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి భౌతిక సాధనాలపై (భూమి, యంత్రాలు, ముడి సరుకులు మొదలైనవి) ఆధిపత్యం పెట్టుబడిదారులకు ఉంటుంది. సజీవ ఉత్పాదక శక్తులుగా (కార్మికుల శ్రమ) కార్మిక వర్గం ఉన్నప్పుడు ఈ రెండింటికి న్యాయం ఉంటుందనేది పొరపాటు అవగాహన. కార్మికులకుండే సాంఘిక శక్తి వారి సంఖ్యాబలమే.

మార్క్స్‌ దృష్టిలో దైనందిన పోరాటాలు…

ట్రేడ్‌ యూనియన్లు… పెట్టుబడికి వ్యతిరేకంగా… వేతనాలు, పని గంటలకు సంబంధించి, దాని దురాచారాల నుండి రక్షణ కోసం దైనందిన పోరాటాలకు పరిమితం కావడం తక్షణ కర్తవ్యంగా భావించుకున్నాయి. ప్రస్తుత ఉత్పత్తి విధానం అమలులో ఉన్నంత కాలం ఈ పోరాటాలు తప్పవు. ఇలాంటి పోరాటాలే సకల దేశాల ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణానికి, వాటి ఐక్యతకు దోహదం చేస్తాయి. తమకు తెలియకుండానే అవి సంఘటిత కార్మికోద్యమ నిర్మాణానికి కేంద్ర బిందువులవుతాయి.

కార్మిక సమ్మెల గురించి…

సమ్మె కార్మిక వర్గ తక్షణ, అంతిమ లక్ష్యాల సాధనకు శక్తివంతమైన పోరాట ఆయుధంగా కారల్‌ మార్క్స్‌, ఎంగెల్సు భావించారు. కార్మిక వర్గ అభివద్ధిలో వివిధ దశలు ఉన్నాయి. కార్మిక వర్గం పుట్టుకతోనే బూర్జువా వర్గంతో దాని పోరాటం ప్రారంభమవుతుంది. మొదట కార్మికులు విడివిడిగా ఎవరికి వారుగా పోరాడతారు. తరువాత ఒక ఫ్యాక్టరీలోని కార్మికులు కలిసి పోరాడతారు. ఆ తరువాత ఒకే స్థలంలో ఉన్న ఒకే రకమైన ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు కలిసి పోరాడతారు. తమను ప్రత్యక్షంగా దోపిడీ చేసే యజమానుల మీద పోరాడతారు.
కార్మికులు-బూర్జువాల మధ్య వ్యక్తిగతంగా జరిగే ఘర్షణలు రాను రాను రెండు వర్గాల మధ్య పోరాటంగా మారుతుంది. అప్పుడు కార్మికులు ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణానికి పూనుకుంటారు. తమ వేతనాల రేటును నిలబెట్టుకోవడానికి అంతా ఏకమవుతారు. ఆ కాలంలో ఇంగ్లాండ్‌లో జరిగిన కార్మికవర్గ పోరాటాలకు ఎంగెల్స్‌ తన గ్రంథంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. సమ్మెను ఒక యుద్ధ పాఠశాలగా, కార్మిక వర్గ విముక్తి కోసం జరిగే పోరాటంలో అవసరమైన, నిర్నిబంధమైన ఒక ఆయుధంగా ఎంగెల్స్‌ పరిగణించారు.
"సమ్మెలు ప్రజలలోని సకల సాంఘిక విప్లవ జీవ కణాలను ఉద్రిక్తపరచుటే గాక ప్రతి కార్మికునిలో నిద్రాణమై ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పుతాయి. నిజానికవి కార్మికుని చారిత్రక సాంఘిక మానసిక ఉనికిగా రూపొందుతాయి.
ప్రజలకు, బూర్జువా వర్గానికి మధ్య అగాధాన్ని విస్తృతం, తీవ్రం చేస్తుంది. గనుక ప్రతి సమ్మె ఎంతో విలువైనది. పెట్టుబడిదారుల ప్రయోజనాలతో తమ ప్రయోజనాలకు పొంతన పసగదని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు కార్మికునికి సమ్మె రుజువు చేస్తుంది. బూర్జువా వర్గం యొక్క రాజకీయ ప్రభావం నుండి కార్మికులు వేరు చేయబడడానికి నిజానికి సమ్మెకు మించిన ఉత్తమ సాధనం మరొకటి లేదు.
అవును, సమ్మె ఒక గొప్ప ఆయుధం. ఇది కార్మిక సైన్యాలను సృష్టించి పెంచి సంఘటిత పరచి బారులుగా కూరుస్తుంది. ఈ సైన్యాలు బుర్జువా రాజ్యాధికారాన్ని నేలమట్టం చేసి నూతన ప్రపంచ సృష్టికి విశాలమైన స్వేచ్ఛా క్షేత్రాన్ని తయారు చేస్తాయి."

అవరోధాలను అధిగమించి…

ప్రస్తుతం కార్పొరేట్‌ శక్తులు తమకు ఎదురు లేదన్నట్లుగా కార్మిక వర్గం మీద ముప్పేట దాడి చేస్తున్నాయి. నేటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అన్ని రకాల అవరోధాలను అధిగమించి కార్మికవర్గం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూనే వుంది. బహుళజాతి సంస్థ అమెజాన్‌లో ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు కోసం ఇటీవల దీర్ఘకాలిక సమ్మె పోరాటం నిర్వహించింది. మరో బహుళజాతి సంస్థ శాంసంగ్‌ లోను అదే రకమైన పోరాటం జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్‌, ఇతర ఫార్మా కంపెనీలలోను పెద్ద ఎత్తున కార్మికులు సమ్మె పోరాటాలు నిర్వహించారు. అనేక విజయాలు సాధించిన అనుభవాలు కూడా ఉన్నాయి.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం సమాజ అభివృద్ధికి ఆటంకం. పెట్టుబడిదారీ వర్గం ద్వారా సృష్టించబడిన ఆధునిక కార్మిక వర్గం ఈ ఉత్పత్తి విధానాన్ని బద్దలు కొట్టి నూతన ఉత్పత్తి విధానాన్ని తీసుకొస్తుంది. అదే సోషలిస్టు ఉత్పత్తి విధానం. అందుకోసం కార్మిక జనావళి ఒక వర్గంగా అభివృద్ధి చెందడమే కాకుండా తన సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేసుకుంటుంది.

వ్యాసకర్త - సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti