Wednesday, 20 Nov, 12.00 am ప్రజాశక్తి

ముఖ్యాంశాలు
అమానుషంపై ఆగ్రహం

* జెఎన్‌యు ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్‌ శ్రీ విచారణకు ప్రతిపక్షాల డిమాండ్‌
జెఎన్‌యు విద్యార్థులపై పోలీసులు జరిపిన అమానుష దాడి పార్లమెంటును కుదిపేసింది. ఉభయసభల్లోనూ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియత ప్రదర్శనకు పిలుపునిచ్చిన విద్యార్థులను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని, పోలీసులచేత అమానుష లాఠీఛార్జీ ఎందుకు చేయించారని సభ్యులు నిలదీశారు. 'శాంతియుతంగా ప్రదర్శన చేయడమే విద్యార్థులు చేసిన తప్పా' అని ప్రశ్నించారు.

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:
మంగళవారం ఉదయం ఉభయసభలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు జెఎన్‌యు విద్యార్థులపై జరిగిన దాడిని ప్రస్తావించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా అడ్డుకున్నారు. ప్రారంభమైన పది నిమిషాలకే రాజ్యసభ వాయిదా పడింది. లోక్‌సభలో సభ్యుల డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాలను నిర్వహించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా ప్రయత్నించారు. దీంతో తమ స్థానాల్లోంచి లేచి నిలబడిన సిపిఎం, టిఎంసి, ఆరెస్పీ, బిఎస్పీ సభ్యులు జెఎన్‌యు విద్యార్థులపై పోలీసుల దాడి ఘటన గురించి చర్చించాలని, విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
స్పీకర్‌ నిరాకరించడంతో పలువురు సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. మరోవైపు సోనియాగాంధీ కుటుంబీకులకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరణపై కాంగ్రెస్‌ ఎంపిలు ఆందోళన చేశారు. జమ్మూకాశ్మీర్‌ ఘటనపై డిఎంకె, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌, ఐయుఎంఎల్‌ తదితర పార్టీల సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. జెఎన్‌యు విద్యార్థులపై దాడిపై చర్చించాలని, ఫరూక్‌ అబ్దుల్లాను సభకు తీసుకురావాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. అలాగే సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత ఉపసంహరణపై కాంగ్రెస్‌, డిఎంకె, సిపిఎం, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌, ఐయుఎంఎల్‌, ఆరెస్పీ, ఎస్పీ తదితర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లాయి.
''ప్రతిపక్షాలపై దాడులు ఆపండి. ప్రతీకార రాజకీయాల వద్దు. దాదాగిరి నశించాలి'' అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యనే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. దీంతో కాంగ్రెస్‌, డిఎంకె సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం జీరో అవర్‌లో జెఎన్‌యు అంశాన్ని వివిధ పార్టీల సభ్యులు లేవనెత్తారు.

రాజ్యసభలో ఇలా...
రాజ్యసభలో తొలుత జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే మృతికి సంతాపం తెలిపారు. అనంతరం అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి సాధించిన అభిజిత్‌ బెనర్జీకి సభ అభినందనలు తెలిపింది. ఆయనకు నోబెల్‌ రావడం గొప్ప విషయమని, దేశానికి గర్వకారణమని చైర్మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా పేదరికంపై బెనర్జీ చేసిన కృషిని కొనియాడారు. అనంతరం సిపిఎం, సిపిఐ సభ్యులు జెఎన్‌యు విద్యార్థులపై పోలీసుల దాడి ఘటనను లేవనెత్తారు. రూల్‌ నెం. 267 ప్రకారం చర్చ చేపట్టాలని పట్టుపట్టారు. ఇప్పటికే తాము నోటీసులు ఇచ్చామని, ఈ అంశంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. దీనిపై చర్చకు చైర్మన్‌ వెంకయ్యనాయుడు అనుమతించకుండా సభను వాయిదా వేశారు. తిరిగి మధ్మాహ్నాం రెండు గంటలకు ప్రారంభమైన సభలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వలేదు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>