కోల్‌కతా : కోల్‌కతాలో ఇటీవల బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులు తీవ్రమయ్యాయి.
కేవలం ఆ పార్టీకి చెందిన వారిపైనే కాకుండా సామాన్య ప్రజలపై కూడా దాడులకు పాల్పడుతోంది. ఇటీవల డమ్‌డమ్ రైల్వే స్టేషన్‌లో చిరు వ్యాపారుల దుకాణాల్ని సైతం అధికారులు కూల్చేశారు. అలాగే ఆదివారం రోజు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దక్షిణ 24 పరగణాలలో దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటన బాధితులైన వారిని కలిసేందుకు వెళ్లిన అభిషేక్‌పై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. ఇటీవల టిఎంసి ఎంపి కళ్యాణ్ బెనర్జీపై చండితాలా పోలీస్ స్టేషన్ సమీపంలో హత్యాయత్నం జరిగింది. ఈ దాడులకు వ్యతిరేకంగా టిఎంసి అధినేత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నిరసన చేయనున్నారు. అయితే ఈ నిరసన చేయడానికి చట్టబద్ధ అనుమతి ఉందా? బిజెపి నేత రాహుల్ సిన్హా ప్రశ్నించారు.
కాగా, ఆమె కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్డు వద్ద నిరసన చేపట్టనుంది. అయితే ఈ నిరసనకు పోలీసుల నుంచి అనుమతి లభించకపోయినా తాము నిరసన చేస్తామని టిఎంసి సుప్రీం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మమతా మీడియాతో మాట్లాడుతూ.. 'అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది టిఎంసి కార్యకర్తలు మృతి చెందారు. వేలాది మంది కార్యకర్తలు అరెస్టయ్యారు. బెదిరింపుల వల్ల చాలామంది తమ ఇళ్ల నుంచి పారిపోయారు. అక్కడ ధర్నాకు మమ్మల్ని అనుమతించకపోతే, నన్ను ఎక్కడ ఆపితే అక్కడ కూర్చుంటాను. అరెస్టుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను' అని ఆమె అన్నారు. కోల్‌కతాలో గనుక నిరసన ఆపితే.. ఢిల్లీలో చేస్తాం అని మమతా అన్నారు.

